
సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రస్థానం 78వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సదాశివునిపేటలో నిర్వహించిన రైతు గోస ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని అన్నారు. ముఖ్యమంత్రి మళ్లీ దొంగ హామీలిచ్చేందుకు రెడీ అవుతున్నాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు పంట వేయని రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరి వేయడం నేడు రైతులకు శాపమైంది. వరి విషయంలో ఊసరవెల్లిలా కేసీఆర్ మాటలు మార్చాడు. రైతులను నిండా ముంచి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మార్చాడు.#RaithuGosa #PrajaPrasthanam #Day78 pic.twitter.com/1LG2rBvKwU
— YS Sharmila (@realyssharmila) May 29, 2022
వరి వేయడం నేడు రైతులకు శాపంగా మారిందని షర్మిల వాపోయారు. వరి విషయంలో కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చాడని మండిపడ్డారు. రైతులను నిండా ముంచి బ్యాంకుల వద్ద డీఫాల్టర్లుగా మార్చాడని.. ఫలితంగా బ్యాంకు అధికారులు వారి ఇళ్లను జప్తు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 8ఏండ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పాపం కేసీఆర్ది కాదా అని షర్మిల ప్రశ్నించారు. రైతు బంధు పేరుతో రూ.5వేలు ఇచ్చి రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తున్నానని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని, రూ.5 వేలు ఇస్తే కోటీశ్వరులు అయిపోతారా అని షర్మిల నిలదీశారు.