రేపే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన

రేపే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ షర్మిల.. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రేపు గురువారం పార్టీ ప్రకటన చేయనున్నారు. అలాగే పార్టీ జెండాను ఆవిష్కరించి తన అజెండాపై స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన తాను తెలంగాణ కోసమే పోరాడతానని.. తెలంగాణలో రాజన్న రాజ్యం ఆవిష్కరించడమే లక్ష్యమని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన చేసినా.. తరచూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు అధికారికంగా పార్టీ ప్రకటన తర్వాత ప్రతి జిల్లాలో, మండలాల్లో, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిల్లో కమిటీలు వేసి క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు
తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిపై నివాళులర్పించిన అనంతరం రేపు ఉదయం 10.30కు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు రానున్నారు షర్మిల. మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకునే షర్మిలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ సంప్రదాయం ప్రకారం బోనాలు, వేడుకలతో ఆహ్వానం పలకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బంజారాహిల్స్ ఫిలింనగర్ లోని  జేఆర్సీ కన్వెన్షన్ కు చేరుకుంటారు. మార్గ మధ్యంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు షర్మిల పార్టీ ప్రకటన, జెండా, ఎజెండాలపై స్పష్టత ఇస్తారు. సాయంత్రం 6.30 వరకు కార్యక్రమం ముగింపు ఉంటుంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా ప్రజలకు సంతోషం లేదు.. అందుకే పార్టీ : కొండా రాఘవరెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ప్రజలు సంతోషంగా లేరని, అందుకే పార్టీ పెడుతున్నామని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. రాజన్న సంక్షేమమే తమ ధ్యేయం అన్నారు. 
జూమ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించే ఏర్పాటు
షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటనను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు నేరుగా చూసేందుకు వీలుగా జూమ్ యాప్ ద్వారా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా జూమ్ ద్వారా వర్చువల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. సుమారు 10 వేల మంది వైఎస్ అభిమానులు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని  వీక్షించే అవకాశం ఉందని ఏర్పాట్లు చేస్తున్నామని రాఘవరెడ్డి వివరించారు.