ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు : షర్మిల

ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు : షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె. నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. 

ఈ ఎన్నికల్లో పోటీ చేసి.. వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా.. కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు.. వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా, సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి.. కేసీఆర్ సీఎం అయితే.. చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె.

Also Read :- తెలంగాణలో ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి జరగలేదు

ఈ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయటం లేదని.. మా పార్టీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయటం లేదని వివరించారామె. ఈ నిర్ణయం చాలా కఠినమైనదని.. చాలా బాధాకరం అన్నారు. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా అభివర్ణించారామె. ఈ నిర్ణయం ఎవరికైనా బాధిస్తే.. క్షమించాలని కార్యకర్తలు, నేతలను కోరారు. రాజకీయం అంటే యుద్ధం అని.. ఆ యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదన్నారు. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పానని.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా విరమించుకుంటున్నానని.. పాలేరు ప్రజలు క్షమించాలని కోరారు.