మార్చి 5న ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు

మార్చి 5న ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చి 5న పాలేరులో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం షర్మిల ఈ యాత్ర చేపట్టారు. 2021, అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు షర్మిల ప్రజల మధ్యలో తిరుగుతూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ.. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు 82 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర సాగింది.

మొత్తం 38వందల కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేశారు. దీంతో, మార్చి 5 నాటికి 4,111కి.మీ మైలు రాయికి చేరనుంది. ఈ నెల 20న పాదయాత్రతో పాలేరు నియోజకవర్గంలో షర్మిల అడుగుపెట్టనున్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకొని పాలేరుకు చేరుకుంటారు. ఆ తర్వాత తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తాండా వద్ద పాలేరు మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 14 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో యాత్రను కొనసాగించి.. పాలేరులో ప్రజాప్రస్థానం ముగింపు సభ నిర్వహించనున్నారు.