
- కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తం
- ఎవరు కలిసి రాకున్నా మా పోరాటం ఆగదు : షర్మిల
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు, పేపర్ల లీకేజీపై సీబీఐ విచారణ వంటి అంశాలపై పోరాటానికి టీసేవ్ ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమం ఉదృతం చేయాలని నిర్ణయించామని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల చెప్పారు. అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని, కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పార్టీలు కలిసి రాకున్నా తమ పోరాటం ఆగదన్నారు. ఈ పోరాటంలో కేసులు పెడతారని, అడ్డుకునేందుకు కుట్రలు చేస్తారని, అలాంటి వాటికి భయపడొద్దని చెప్పారు. బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులతో షర్మిల సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించారు.
7 నుంచి 12 వరకు పలు కార్యక్రమాలు
ఈ నెల 7న జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కాగడాల ప్రదర్శన, 8న తహసీల్దార్ లేదా ఆర్డీవో కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు, 9న ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, 11న జిల్లా, మండల కేంద్రాల్లో టీసేవ్ లోగో ఆవిష్కరణ, ప్రెస్ మీట్, 12న కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని షర్మిల ప్రకటించారు.
రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఇటీవల పరీక్షలు రాశారని, ఇప్పుడు పేపర్ల లీకేజీతో అందరూ ఆందోళనలో చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో ఎందుకు విచారణ జరిపించటం లేదని, కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని, కేంద్రం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదన్నారు.
తమ్మినేని భయపడుతున్నడు: గట్టు
పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించగానే తమ్మినేనికి భయం పట్టుకుందని వైఎస్సార్ టీపీ నేత గట్టు రామచందర్ రావు అన్నారు. బీఆర్ఎస్తో ఒప్పందం చేసుకుని పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే పార్టీ మీటింగ్లో షర్మిలను అవమానించేలా మాట్లాడారన్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగానే అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
టీసేవ్ ఫోరం డిమాండ్లు
- బిశ్వాస్ కమిటీ ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలి.
- టీఎస్ పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలి. పేపర్లు లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
- పేపర్ల లీకేజీ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- పేపర్ల లీక్ దోషులను శిక్షించాలి. పరీక్షలు తిరిగి నిర్వహించాలి
- నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలి
- నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలి
- బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు లోన్లు అందజేయాలి
- రీయింబర్స్మెంట్బకాయిలు చెల్లించడంతో పాటు స్టూడెంట్లకు స్కాలర్షిప్లు అందజేయాలి
- వర్సిటీలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
- వర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
- అన్ని రకాల విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి
- హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలి