బంగారు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే బాగుపడ్డడు : షర్మిల

బంగారు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే బాగుపడ్డడు :  షర్మిల

ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగే కేసీఆర్.. ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణలో కేవలం కేసీఆర్ మాత్రమే బాగు పడ్డారని చెప్పారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయక.. బ్యాంకుల వద్ద రైతులను కేసీఆర్  డీ ఫాల్టర్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భూపాలపల్లి ఎమ్మెల్యేకు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల... ఘనపురం గ్రామస్థులతో ముచ్చటించారు. 

వైఎస్సార్ పథకాలు నిర్వీర్యం 

కేసీఆర్కు ప్రజా సంక్షేమంపై సోయి లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ అమలు చేసిన పథకాలను అన్నింటిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టారన్నారు. ప్రజల ఆరోగ్య అంటే కేసీఆర్కు విలువలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థులు వైఎస్సార్ పాలనలో గొప్ప చదువులు చదువుకున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా కాలేజీలకు రూ. 3వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. 

ప్రతిపక్షాలు కేసీఆర్కు అమ్ముడుపోయాయి

ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు.  2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ..ఇచ్చింది కేవలం 20 వేలు మాత్రమే అని చెప్పారు.  ప్రజల పక్షాన నిలబడే నాయకుడే లేరన్నారు. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు ఉన్నా  లాభం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు కేసీఆర్కు అమ్ముడుపోయాయన్నారు. కేసీఅర్ దగ్గర వాటాలు తీసుకొని విపక్షాలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్టీపీ  పోరాటం చేస్తే వారి  సమస్య వెలుగులోకి వచ్చిందని తెలిపారు.