నన్ను నడిపించింది మీ చిరునవ్వులే

నన్ను నడిపించింది మీ చిరునవ్వులే

రాష్ట్రంలో సమస్యలు లేని గడపలేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. టీఆర్ఎస్ పాలకులు రాష్ట్రంలో సమస్యలు లేవని చెప్తున్నారని.. అది అవాస్తవమన్నారు. ‘‘సమస్యలు ఉన్నాయని ఎత్తిచూపేందుకే నేను పాదయాత్ర చేస్తున్నాను. మీకు దమ్ముంటే నాతో ఒక్కరోజు పాదయాత్ర చేయండి. సమస్యలు లేకపోతే నేను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతా. ఒకవేళ సమస్యలు ఉంటే దళితున్ని సీఎం చేస్తారా’’ అంటూ షర్మిల సవాల్ విసిరారు. 1500 కిలోమీటర్లు  నడిచింది నేనే అయినా..నడిపించింది మాత్రం ప్రజల చిరునవ్వులే అని ఆమె చెప్పారు.

వైఎస్సార్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి వాటిని బ్రహ్మాండంగా అమలు చేసి చూపించారని షర్మిల అన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్సార్ అని..ముఖ్యమంత్రి అంటే ఆయనలా ఉండాలని ఆమె అన్నారు. ఇప్పుడున్నా సీఎం గత 8ఏళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక చనిపోతున్నా..కేసీఆర్ ముసలి కన్నీరు కార్చడం తప్ప చేసిందేమి లేదన్నారు. వరి వేసుకుంటే ఉరి అనే సన్నాసి సీఎం ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. ఇది ప్రజా స్వామ్యం కాదు...తాలిబన్ల రాజ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఅర్ కు ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకోవడం తప్ప..పరిపాలన  చేతకాదని షర్మిల విమర్శించారు. పాలక పక్షం పడుకుంటే..ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా గుడ్డి గుర్రాలకు పల్లు తోముతున్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో  కేసీఅర్ 70వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతుంటే పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదన్న షర్మిల..హైదరాబాద్ లో నడిరోడ్డు మీద మైనర్ పై అఘాయిత్యం చేస్తే చర్యలు లేవని మండిపడ్డారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఈ సారి కేసీఆర్ ని నమ్మి మోసపోకుండా వైఎస్సార్ బిడ్డను అయిన తనకు ఓటేసి ఆశీర్వదించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.