పాలేరుపై షర్మిల ఫోకస్​

పాలేరుపై షర్మిల ఫోకస్​

ఖమ్మం, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కసరత్తు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీలో ఉంటానని గతంలోనే ప్రకటించారు. ఆ తర్వాత పలు రకాల ప్రచారాలు తెరపైకి వచ్చినా, వాటన్నింటినీ పక్కనపెడుతూ పాలేరు సెగ్మెంట్ పరిధిలో పార్టీ ఆఫీస్​ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల16న భవన నిర్మాణానికి షర్మిల శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. ఖమ్మం బైపాస్​ రోడ్​లో ఉన్న కరుణగిరి చర్చి సమీపంలో ఇప్పటికే ఆఫీస్​నిర్మాణం కోసం భూమి కొన్నారు. హైదరాబాద్​ లోని లోటస్​పాండ్ లో ఆఫీస్​తర్వాత ఇతర జిల్లాల్లో ఎక్కడా పార్టీ కోసం సొంతంగా భూమి కొని ఆఫీసులు ఏర్పాటు చేయలేదు. మొదటిసారిగా, అది కూడా ఖరీదైన స్థలాన్ని కొని పాలేరు నియోజకవర్గం కోసం ఆఫీస్​ నిర్మాణం చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో పాలేరు సెగ్మెంట్ పై షర్మిల సీరియస్​గానే నజర్​ పెట్టిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఆఫీస్​ నిర్మాణాన్ని కంప్లీట్ చేసి, ఇతర పార్టీల నుంచి చేరికలను, ఎన్నికల వ్యూహాలను ఇక్కడి నుంచే ఖరారు చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

వారానికి ఒక్కసారైనా వచ్చేలా...

ఎన్నికలు జరిగి నాలుగేండ్లు కంప్లీట్ కావడంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్​ ఫీవర్​ కనిపిస్తోంది. దీంతో తాను సొంతంగా పోటీ చేసే పాలేరు సెగ్మెంట్ పై మరింత ఫోకస్​ పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఆఫీసును ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. కనీసం వారానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఉండేలా, పార్టీ ఆఫీస్​ తో పాటు బస చేసేందుకు అవసరమైన గెస్ట్ హౌజ్​ కూడా నిర్మిస్తారని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. అలాగే త్వరలోనే పాలేరు నియోజకవర్గం మొత్తాన్ని కవర్​చేసేలా యాత్ర ప్లాన్​ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను, షెడ్యూల్ ను ఆఫీస్​ శంకుస్థాపన పూర్తయిన తర్వాత షర్మిల ప్రకటిస్తారని సమాచారం. 

హేమాహేమీలంతా ఇక్కడినుంచే...

పాలేరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి గెలిచి టీఆర్ఎస్​లో చేరారు. వచ్చే ఎన్నికల్లో తాను టీఆర్ఎస్​నుంచే బరిలో ఉంటానని ఆయన ధీమాగా చెబుతున్నారు. గత ఎలక్షన్లలో ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు ఖాయమైతే సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బరిలో ఉంటారన్న ప్రచారం ఉంది. ఇక కాంగ్రెస్​ తరపున ముగ్గురు, నలుగురు లీడర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు షర్మిల కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇదే సీటును సెలక్ట్ చేసుకున్నారు. దీంతో పాలేరులో ఎవరు, ఏ పార్టీ తరపున బరిలో ఉంటారన్న ఆసక్తి ఒకవైపు, వీళ్లందరిలో ఎవరు విజయం సాధిస్తారన్న అంచనాలు మరోవైపు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పాలేరు సెగ్మెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంత మంది నేతలు బరిలోకి దిగేందుకు పాలేరును సెలక్ట్ చేసుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన నియోజకవర్గంగా మారే అవకాశం కనిపిస్తోంది.