3 రాజధానులు వద్దు: జగన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం

3 రాజధానులు వద్దు: జగన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం

ఏపీ రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చేసిన కామెంట్స్ అన్ని పార్టీల్లోనూ చీలిక వచ్చింది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చేమో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను టీడీపీ, జనసేన, బీజేపీల్లోనూ కొందరు నేతలు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే తొలిసారి అధికార పార్టీ వైసీపీలోనూ ఓ ఎమ్మెల్యే.. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్స్ అన్న జగన్ వ్యాఖ్యలపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పరిపాలన విభాగమైన సచివాలయం ఓకేచోట ఉండాలని చెప్పారాయన. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ వేర్వేరు చోట్ల వద్దని, అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. ఇది తన అభిప్రాయమని, దీన్నే సీఎం జగన్‌కూ తెలియజేస్తానని చెప్పారు గోపిరెడ్డి.

ప్రజల్లో అపోహలు వద్దు

ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయి  ఉన్నామని, మరోసారి ప్రజలు నష్టపోవడం సరికాదని చెప్పారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చినతర్వాత సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. రాజధాని విషయంలో ప్రజలు అపోహలు పడవద్దని కోరారు.