
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో.. కొన్ని వారాలుగా సీబీఐ విచారణకు హాజరవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని..ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని.. 2023, మార్చి 9వ తేదీ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని.. సీబీఐ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతున్నానని.. విచారణకు సహరిస్తున్నానంటూ పిటీషన్ లో స్పష్టం చేశారు అవినాష్ రెడ్డి.
సీబీఐ విచారణను ఆడియో, వీడియో తీయాలని.. ఈ విషయాన్ని గతం నుంచీ కోరుతున్నానని.. విచారణ తీరు మొత్తాన్ని ఇన్ కెమెరాలో షూట్ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు ఎంపీ. ఈ మేరకు సీబీఐని ఆదేశించాలని కూడా కోరారు. అదే విధంగా లాయర్ సమక్షంగా సీబీఐ విచారణ చేయాలని.. విచారణ మొత్తాన్ని రికార్డ్ చేయటంతోపాటు లాయర్ సమక్షంలో ప్రతి అంశాన్ని నోట్ చేసే విధంగా సీబీఐని అదేశించాలంటూ రిట్ పిటీషన్ దాఖలు చేశారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.
సీబీఐ విచారణకు మార్చి 10వ తేదీన హాజరవుతానని., తన తండ్రి భాస్కరరెడ్డి 12వ తేదీన హాజరవుతారని ఇటీవలే వెల్లడించారు ఎంపీ. ఇదే సమయంలో.. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ హాట్ కామెంట్స్ చేశారు. మార్చి 10వ తేదీ సీబీఐ విచారణకు హాజరు కానున్న సమయంలోనే.. మార్చి 9వ తేదీన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది.