కబ్జాలు, దోపిడీ ఇదే కేసీఆర్​ పని : షర్మిల ఫైర్​

కబ్జాలు, దోపిడీ ఇదే కేసీఆర్​ పని : షర్మిల ఫైర్​
  • కాళేశ్వరం కట్టి తన ఫామ్‌‌హౌస్‌‌కి 
  • నీళ్లు ఎత్తుకుపోయిన దొంగ
  • ప్రాజెక్టు రీడిజైన్ పేరిట లక్ష కోట్లు దోచుకున్నడు
  • మంత్రి గంగుల గుప్పిట్లో ఇసుక మాఫియా
  • కరీంనగర్‌‌‌‌లో రౌడీ రాజ్యం నడుస్తున్నదని ఆరోపణ

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్.. పెద్ద 420 అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తన ఫామ్‌హౌస్‌కి నీళ్లు ఎత్తుకుపోయిన దొంగ కేసీఆర్ అని ఆరోపించారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరిట రూ.లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. ఆ ప్రాజెక్టుతో కరీంనగర్‌‌ జిల్లా రైతులకు ప్రయోజనం అందలేదన్నారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం కరీంనగర్ వన్ టౌన్ సర్కిల్‌లో జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. కబ్జాలు చేయడం, దోచుకుతినడం, ఎత్తుకుపోవడం కేసీఆర్‌‌కే చెల్లిందన్నారు. మంత్రి గంగుల కమలాకర్​పై ఈడీ దాడులు జరిగితే.. ఆయన అవినీతిపై బీజేపీ నేత బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదని షర్మిల ప్రశ్నించారు. గంగుల, సంజయ్ ఒక్కటేనన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టి చలి కాచుకోవాలన్నదే బీజేపీ రాజకీయమని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ట్రైబల్ వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.

గంగుల.. మాఫియా డాన్

‘‘గంగుల కమలాకర్ కాదు.. ఊసరవెల్లిలా రంగులు మార్చే రంగుల కమలాకర్. గ్రానైట్, ఇసుక, గుట్కా, భూ కబ్జాలు చేస్తూ సంపాదనే సింగిల్ పాయింట్​ఎజెండాగా పెట్టుకున్నారు. డాన్ మాదిరిగా మాఫియా నడిపిస్తున్నారు” అని షర్మిల ఆరోపించారు. ‘‘మొత్తం ఇసుక మాఫియా మంత్రి గుప్పిట్లో ఉంది.. ప్రశ్నిస్తే డబ్బులు చల్లుతారు.. వినకుంటే దాడులు చేస్తారు.. గంగుల రౌడీ రాజ్యం నడుస్తున్నది’’ అని ఫైర్ అయ్యారు. మంత్రి ఇంట్లో ఈడీ సోదాల్లో  హవాలా డబ్బు దొరికిందన్నారు. గ్రానైట్ మైనింగ్‌లో రూ.350 కోట్లు కేంద్రానికి కట్టాల్సి ఉందని చెప్తున్నారని, ఆయన దోపిడీకి ఇదే నిదర్శనమని అన్నారు. గంగుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.