కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడినయ్

కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడినయ్

మెదక్, వెలుగు: సీఎం కేసీఆర్ కు అధికార మదం తలకెక్కిందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ఫాంహౌస్​కు పరిమితమవుతారని అన్నారు. ఆదివారం ఆమె మెదక్ లో పాదయాత్ర చేశారు. మూతపడ్డ మంబోజిపల్లి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో మాట్లాడారు. అనంతరం మెదక్​పట్టణంలోని రాందాస్​చౌరస్తాలో జరిగిన సభలో ప్రసంగించారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీఆర్ఏలు సీఎం కేసీఆర్ కు వినతిపత్రం ఇస్తే ముఖం మీద విసిరేశారట. ఇది అధికార మదం కాదా! వాళ్లు తెలంగాణ బిడ్డలు కాదా! తెలంగాణ కోసం కొట్లాడలేదా?” అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో తాలిబాన్ల తరహా పాలన సాగుతోందని, మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని కేసీఆర్.. ఉరేసుకొని సచ్చిపోవాలని కామెంట్ చేశారు. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది? 

అధికారంలోకి రాగానే 100 రోజుల్లో నిజాం షుగర్​ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతి ఎంతో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్​ చూస్తే చాలని, మూడేండ్లలో లక్ష కోట్లు మింగేసి మునిగిపోయే ప్రాజెక్ట్​ కట్టారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్​ఎడమకాలి చెప్పు కింద నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పందికొక్కుల్లాగా ఇక్కడ తిన్నది చాలదని.. ఇక దేశం మీద పడతారట. అందుకోసం 100 కోట్లు పెట్టి జెట్ విమానాలు, హెలికాప్టర్లు కొంటారట. ఈ డబ్బు టీఆర్ఎస్​నాయకులకు ఎక్కడ నుంచి వచ్చింది’’ అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భర్త కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన చైర్మన్ గా ఉన్న కోనాపూర్ సొసైటీలో అవినీతి జరిగితే కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.