సీఎం అయ్యాక నిరుద్యోగుల కోసమే నా ఫస్ట్ సంతకం:షర్మిల

సీఎం అయ్యాక నిరుద్యోగుల కోసమే నా  ఫస్ట్ సంతకం:షర్మిల

ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎఫ్ఆర్ వో శ్రీనివాస్ హత్యకు ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణ చేశారని అన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ అని చెప్పి.. మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతులకు ఉచిత ఎరువులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు.. అన్నీ ఉత్తమాటలేనని షర్మిల ఆరోపించారు. 

వైఎస్సార్ పాత్ర కీలకం

ఉమ్మడి వరంగల్​ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్​ పాత్ర కీలకమని షర్మిల అన్నారు. ములుగులో వైఎస్సార్​ ఉన్నప్పుడే దేవాదుల ప్రాజెక్టు 50 శాతం పూర్తయ్యిందని.. దీనికోసం సీఎం కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టును రూ. 6500 కోట్లతో తలపెట్టింది వైఎస్సారే నని ఆమె గుర్తు చేశారు. అప్పుడే 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయని చెప్పారు. తాను సీఎం అయితే నిరుద్యోగుల ఉద్యోగం కోసమే తొలి సంతకం చేస్తానని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో బెల్డ్ షాపులు లేకుండా చేస్తానని చెప్పారు. ప్రతి పేద కుటుంబం కోసం చివరి నిమిషం వరకు సేవ చేసుకుంటానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని షర్మిల కోరారు.