కేసీఆర్ ​అంటేనే మోసగాడు: వైఎస్ షర్మిల

కేసీఆర్ ​అంటేనే మోసగాడు: వైఎస్ షర్మిల

మంచిర్యాల, వెలుగు: నాడు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొని, ఇప్పుడు మునుగోడులో ఓటర్లకు డబ్బులు పంచిన సీఎం కేసీఆర్​అందరికీ నీతులు చెపుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆయన శోకాలు పెడ్తున్నారని, కేసీఆర్​అంటేనే మోసగాడని, ఆయన ఒక 420 అని తీవ్రస్థాయిలో ఆమె విమర్శించారు. ఎనిమిదిన్నర ఏండ్లలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, 57 ఏళ్లకు పెన్షన్, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి హామీ మోసమే అని ఫైరయ్యారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట నుంచి హాజీపూర్​ వరకు షర్మిల పాదయాత్ర కొనసాగించారు. ఈ యాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా హాజీపూర్​ శివారులో పైలాన్, వైఎస్సార్​ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్​ చెప్పేవి శ్రీరంగ నీతులు,  చేసేవి పనికిమాలిన పనులని ధ్వజమెత్తారు. కేసీఆర్​ మునుగోడులో ఒక్కో ఓటును వేలు పెట్టి కొన్నారని, నల్లా తిప్పితే నీళ్ల కన్నా లిక్కర్ వచ్చిందని, సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కోట్లు ఇచ్చి కొన్నారని విమర్శించారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ మాట్లాడితే అంత కన్నా అసహ్యంగా ఉంటుందన్నారు. బంగారు తెలంగాణలో ప్రజలు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతున్నారని అనడానికి సిగ్గుండాలన్నారు. తెలంగాణలో పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు లేదని, ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్​ రైతుద్రోహి అని దుయ్యబట్టారు. రాష్ర్టంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివిన  ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.70 వేల కోట్లను సీఎం కాజేశారని షర్మిల ధ్వజమెత్తారు. టీఆర్ఎస్​ పాలనలో ఎవరికీ రక్షణ లేదని, కేసీఆర్ సిగ్గుతో ఉరివేసుకొని చావాలన్నారు.

ప్రజల సమస్యలకు ముగింపు పలికే యాత్ర 
షర్మిల పాదయాత్ర ఓట్ల కోసం చేసే యాత్ర కాదని, తెలంగాణ ప్రజల సమస్యలకు ముగింపు పలికే యాత్ర అని వైఎస్ విజయమ్మ అన్నారు. మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర పైలాన్, వైఎస్సార్​ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల అభిమానమే షర్మిలను మూడువేల కిలోమీటర్లు నడిపించిందన్నారు. తెలంగాణ పల్లె ఎందుకు కన్నీరు పెడుతున్నదో, తెలంగాణ తల్లి ఎందుకు రోదిస్తున్నదో, ప్రతి గుండెచప్పుడును తెలుసుకునేందుకే ఈ  యాత్ర అన్నారు. ఆమెను ఆశీర్వదించాలని ప్రజలకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు.