ప్లాన్ ప్రకారమే బస్సును తగలబెట్టారు: షర్మిల 

ప్లాన్ ప్రకారమే బస్సును తగలబెట్టారు: షర్మిల 

ప్రజా ప్రస్థానం పాద యాత్రను అడ్డుకుని..తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండిపడ్డారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని తెలిపారు. బస్సు అద్దాలు రాళ్లతో పగలగొట్టి, కారుతో  దాడి చేయించి..వైఎస్సార్టీపీ కార్యకర్తలను కొట్టారని చెప్పారు.బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది  సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు పర్మీషన్ ఉందని..కావాలనే పాదయాత్ర వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపించారు. బస్సుకు నిప్పుపెట్టిన అనంతరం తమ కార్యకర్తలు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఇలాంటి దాడులకు భయపడబోమని..ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేది లేదని తేల్చిచెప్పారు. 

ప్రజా సమస్యలపైనే తాను పోరాడుతున్నాని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు చేసినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వరుకు తన పోరాటం ఆగదన్నారు.