లేడనుకున్నోడు..  మీడియా ముందుకొచ్చిండు!

లేడనుకున్నోడు..  మీడియా ముందుకొచ్చిండు!
  • అఫ్గాన్ ఆక్రమణ తర్వాత మీడియా ముందుకు తాలిబాన్ ‘ఘోస్ట్’ లీడర్ జబీహుల్లా 
  • ఎన్నోసార్లు దాడులు చేసినా తనను పట్టుకోలేకపోయింది


ఇస్లామాబాద్: ఎన్నో ఏండ్లుగా తాను కాబూల్​లోనే ఉన్నా.. అమెరికా బలగాలు తన జాడను కూడా తెలుసుకోలేకపోయాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 2007 నుంచే తాలిబాన్ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న ముజాహిద్ పోయిన నెల17న తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గతంలో ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడినా, అతని రూపురేఖలు ఎవ్వరికీ తెలియలేదు. దీంతో అందరూ అతనిని తాలిబాన్ల ‘ఘోస్ట్’ లీడర్ గా పిలిచేవారు. తన గతం గురించి ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. ‘‘ఎన్నో ఏండ్లుగా నేను కాబూల్ లోనే ఉన్నా. దేశమంతటా స్వేచ్ఛగా తిరిగిన. మీడియాతో ఎన్నోసార్లు ఫోన్, ఈ–మెయిల్, మెసేజులు, ట్విట్టర్, జిహాదీ వెబ్ సైట్ల ద్వారా మాట్లాడిన. నన్ను పట్టుకునేందుకు అమెరికన్ ఆర్మీ దాడులు చేసింది. కానీ ప్రతిసారీ నేను తప్పించుకున్నా” అని ముజాహిద్ చెప్పారు.
పాక్ జిహాద్ వర్సిటీలో చదువుకున్న..
పాకిస్తాన్​లో నౌషెరా సిటీలోని హక్కానియా సెమిన రీ వర్సిటీలో తాను చదువుకున్నట్లు ముజాహిద్ తెలిపారు. పాక్ ప్రభుత్వం నుంచి రెగ్యులర్​గా నిధులు అందుతున్న ఈ వర్సిటీకి జిహాద్, తాలిబాన్ యూనివర్సిటీగా పేరు ఉంది. తాలిబాన్ల అధికార ప్రతినిధిగా ఎన్నికైనప్పటి నుంచీ తెరవెనుకే ఉన్నానని ముజాహిద్ చెప్పారు. కాబూల్​లో అమెరికా సేనల కండ్లు గప్పి తిరిగానని, తాను వాళ్లకు ఎప్పుడూ ఒక పజిల్ గానే ఉండేవాడినన్నారు. చివరకు తనను ఒక కల్పిత వ్యక్తి అని, తన పేరుతోనే కొందరు తాలిబాన్ నేతలు మీడియాతో మాట్లాడతున్నారని అమెరికా అనుకున్నదన్నారు.