టీ20 వరల్డ్ కప్లో సంచలనం..జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి

టీ20 వరల్డ్ కప్లో సంచలనం..జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి

టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పసికూన జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడిపోయింది.  జింబాబ్వే విసిరిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో  పరాజయం పాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. 

వసీం ధాటికి ఫసక్..
ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మొదట్లో దూకుడుగా ఆడింది. దీంతో ఆ జట్టు తొలి  5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత జింబాబ్వే  ఓపెనర్లు వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం వచ్చిన శుంబా కూడా త్వరగా పెవీలియన్ చేరడంతో జింబాబ్వే 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా...సీన్ విలియమ్స్ 31 పరుగులతో రాణించాడు. అయితే సీన్ విలియమ్స్ ను షాదాబ్ ఖాన్  బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత  జింబాబ్వే వరుసగా వికెట్లను కోల్పోయి..చివరకు  20 ఓవర్లలో 130 పరుగులకే పరిమితమైంది.

పాక్ నడ్డివిరిచిన సికిందర్ రజా...
131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్...ఆరంభంలోనే  ఓపెనర్లు బాబర్ ఆజమ్ , రిజ్వాన్  వికెట్లను కోల్పోయింది. ఇఫ్తికార్ అహ్మద్ సైతం త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో షాన్ మసూద్ జట్టును ఆదుకున్నాడు. 44 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ  స్పిన్నర్ సికిందర్ రజా వరుస బంతుల్లో షాదాబ్ ఖాన్ , హైదర్ అలీని పెవిలియన్ చేర్చాడు. రజా వేసిన మరుసటి ఓవర్లోనే వైడ్ ను ఆడబోయిన షాన్ మసూద్ స్టంపౌట్ కావడంతో.. పాక్ 15.1 ఓవర్లలో 94 పరుగులకే  6 వికెట్లు కోల్పోయింది. 

లాస్ట్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ...
పాక్ గెలవాలంటే...29 బంతుల్లో 37 పరుగులు అవసరం అయ్యాయి. ఆ తర్వాత కూడా జింబాబ్వే బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో...చివరి ఓవర్లలో పాక్ గెలవాలంటే 11 పరుగులు చేయాలి. చివరి ఓవర్ ను ఎవాన్స్ వేశాడు. ఈ ఓవర్ ఫస్ట్ బాల్ కు నవాజ్ మూడు పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతికి వసీం ఫోర్ కొట్టాడు. మూడో బాల్ కు సింగిల్ వచ్చింది. దీంతో సమీకరణం మూడు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు.  ఐదో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్ క్యాచ్ అవుటయ్యాడు. లాస్ట్ బాల్ కు  పాక్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా... ఒక పరుగు తీసిన షాహీన్ అఫ్రిదీ....రెండో పరుగు తీసే క్రమంలో  రనౌట్ అయ్యాడు. చివరకు పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులే చేయగలిగింది. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.