Drugs: డోపింగ్‌లో పట్టుబడిన క్రికెటర్లు.. సస్పెండ్

Drugs: డోపింగ్‌లో పట్టుబడిన క్రికెటర్లు.. సస్పెండ్

క్రికెటర్లే కాదు.. క్రీడ ఏదైనా, క్రీడాకారులు ఎవరైనా నిషేధిత డ్రగ్స్ వాడటం నిషేధం. అలా వాడినట్లయితే డోపింగ్‌లో దొరికిపోతారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు క్రికెట్‌లో చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు జింబాబ్వే ఆల్‌రౌండర్లు వెస్లీ మాధేవెరే, బ్రాండన్ మవుతా డోపింగ్‌లో పట్టుబడటంతో కలవరం మొదలైంది. ఇటీవల జరిగిన డోప్ పరీక్షల్లో వీరిద్దరూ నిషేధిత రిక్రియేషనల్ డ్రగ్‌ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు వీరిద్దరిని సుస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.   

డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ జింబాబ్వే క్రికెట్ తక్షణమే వీరిద్దరిని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. త్వరనే వీరు క్రమశిక్షణా కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో వీరిద్దరూ జట్టులో సభ్యులు. డిసెంబర్ 10న ఐర్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో వీరు తుది జట్టులో ఉన్నారు. 23 ఏళ్ల మాధేవెరే జింబాబ్వే తరఫున మూడు ఫార్మాట్లలో 98 మ్యాచ్‌లు ఆడాడు. 26 ఏళ్ల మౌతా 12 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.