కొన్ని ఆర్డర్లను స్వయంగా డెలివరీ చేసిన జొమాటో సీఈఓ

కొన్ని ఆర్డర్లను స్వయంగా డెలివరీ చేసిన జొమాటో సీఈఓ
  • శనివారం రాత్రి డెలివరీ చేసిన జొమాటో, స్విగ్గీ 

న్యూఢిల్లీ: జొమాటో,  స్విగ్గీలు డిసెంబర్ 31 న టన్నుల కొద్దీ బిర్యానీని డెలివరీ చేశాయి. న్యూ ఇయర్ ఈవ్‌ కావడంతో   కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయని ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు చెబుతున్నాయి. శనివారం రాత్రి 10.30 నాటికి దేశం మొత్తం మీద 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను  డెలివరీ చేశామని  స్విగ్గీ ప్రకటించింది. 61,000 పిజ్జాలను, వేల కొద్ది నాచోలు, సోడాలను  కస్టమర్లకు డెలివరీ చేశామని వివరించింది. 

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ శనివారం 15 టన్నుల బిర్యాని (16,514 బిర్యానీలు) ని డెలివరీ చేశామని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని ట్వీట్ చేశారు.  తమ సర్వర్లు ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా కొద్దిగా ముందే ఆర్డర్లు పెట్టండని కస్టమర్లను ఆయన కోరారు. తమ ప్లాట్‌ఫామ్‌కి వచ్చిన ఆర్డర్లు  వాల్యూమ్స్‌ గతేడాది డిసెంబర్ 31 తో పోలిస్తే ఈసారి 45 % పెరిగాయన్నారు.

దీపిందర్ గోయల్ కొన్ని ఆర్డర్లను స్వయంగా డెలివరీ చేశారు . ‘రెండు మూడు ఆర్డర్లను డెలివరీ చేయడానికి వెళుతున్నా. ఇంకో గంటలో తిరిగొస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. శనివారం వచ్చిన బిర్యానీ ఆర్డర్లలో 75.4 % మంది హైదరాబాద్ బిర్యానీ కోసం, 14.2 % మంది లక్నోవి బిర్యానీ కోసం ఆర్డర్లు పెట్టారని స్విగ్గీ పేర్కొంది.  

సింగిల్‌ ఆర్డర్‌‌ రూ.28,962.. 

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌  కూడా శనివారం బిజీబిజీగా నడిచాయి. జొమాటోకి చెందిన బ్లింకిట్ తమ ప్లాట్‌ఫామ్‌లో బెంగళూరులోని ఒక కస్టమర్ ఏకంగా రూ.28,962 విలువైన అతిపెద్ద ఆర్డర్ పెట్టారని  పేర్కొంది.  ‘56,437 చిప్స్‌ ప్యాకెట్లను డెలివరీకి పంపాం. ఇవి ఇంకో 9 నిమిషాల్లో కస్టమర్లకు చేరుతాయి’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్  ధిండ్సా ట్వీట్ చేశారు. స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ కంపెనీ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా శనివారం భారీగా ఆర్డర్లను డెలివరీ చేసింది. 

శనివారం రాత్రి 7 నాటికి  1.76 లక్షల చిప్స్‌ ప్యాకెట్లను, 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ చేసిందని స్విగ్గీ ప్రకటించింది. ఇంకో 4,212 కండోమ్​ ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే ఈ నెంబర్ ‘6969’ కి చేరుకుంటుందని సరదాగా ట్వీట్ చేసింది. శనివారం రాత్రి 9.18 నాటికి 12,344 మంది  ఖిచిడీ ఆర్డర్ చేశారని వివరించింది.