
అడుసు తొక్కొద్దు. కాలు కడగొద్దు. కానీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జుమాటో కు ఇది ప్రతిసారీ పరిపాటి గానే మారింది. వివాదాస్పదమైన ప్రకటనలు రూపొందించడం, ఆ తర్వాత జనాగ్రహానికి గురి కావటం, క్షమాపణలు చెప్పటం ఆ సంస్థకు అలవాటే. ఇప్పుడు తాజాగా గురుగ్రామ్ పోలీసులకు జుమాటో సంస్థ క్షమాపణలు చెప్పింది. Zomato ఫుడ్ డెలివరీ సంస్థ అరటిపండు చిప్స్ ప్యాకెట్ తో HELPPP (పెద్ద అక్షరాలతో) కంప్యూటర్ స్క్రీన్ షాట్ ను X ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. హలో @gurgaonpolice... ఎవరో ఆఫీసుకి డ్రగ్స్ తెచ్చారు అంటూ అరటిపండు చిప్స్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. అయితే ఇది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు సరదాగా చేసిన ఈ ట్వీట్ పలు వివాదాలకు దారితీసింది. జుమాటో సంస్థ పోలీసు హ్యాండిల్ ను ట్యాగ్ చేసింది. అయితే ఇది పోలీసులను అవమానపరిచే విధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం సరికాదని కొంతమంది తమ అభిప్రాయాన్ని తెలిపారు.
జుమాటో లిస్టెడ్ కంపెనీ .. ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం సరికాదని ఒకరు స్పందించారు. సోషల్ మీడియాలో లైక్ లకోసం.. RTలను స్కోర్ చేసేందుకు పోలీసు హ్యాండిల్ ను ట్యాగ్ చేయకూడదంటూ... ఈ విషయమై గుర్గావ్ పోలీసులు స్పందిచాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. అయితే నెటిజన్ల విమర్శలకు స్పందించిన జుమాటో ఈ ట్వీట్ ను తొలగించి పోలీసులకు క్షమాపణలు కోరింది. జుమాటో ఫుడ్ డెలివరీ సంస్థ క్రికెట్ మ్యాచ్ లు... పండుగల సమయంలో సరదాగా ట్వీట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది, కొన్నిసార్లు సరదాగా.. నవ్వుతెప్పించే లాగా ఉంటాయి. మరికొన్ని ట్వీట్ వివాదాలకు దారితీస్తాయి. గతంలో కూడా ఇలాగే విమర్శలను ఎదుర్కొంది.