టవర్లున్నా సిగ్నల్స్‌‌‌‌ మాత్రం రావు.. అదో మిస్టరీ

టవర్లున్నా సిగ్నల్స్‌‌‌‌ మాత్రం రావు.. అదో మిస్టరీ

ఇది టెక్‌‌‌‌ యుగం.. మంచినీళ్లు దొరకని ప్లేస్‌‌‌‌లో కూడా సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ వస్తున్నాయి. ఇంటర్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌ వాడగలుగుతున్నాం. పెద్ద పెద్ద అడవుల్లో మినహా... జనసంచారం లేని ప్రాంతాల్లో కూడా సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఉంటున్నాయి.ఇక్కడ మాత్రం అడుక్కో సెల్‌‌‌‌ఫోన్ టవర్‌‌‌‌‌‌‌‌ వేసినా సిగ్నల్స్ రావని సైంటిస్ట్‌‌‌‌లు తేల్చి చెప్పారు. కానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోయారు. అంతేకాదు ఈ ప్రాంతం చుట్టూ చాలా మిస్టరీలు ఇప్పటికీ చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి. 

భూమ్మీద అనేక మిస్టీరియస్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు ఉన్నాయి. సైన్స్ డెవలప్‌‌‌‌ అయిన తర్వాత వాటిలో కొన్ని మిస్టరీలను తెలుసుకోగలిగారు. కానీ.. ఇప్పటికీ సైంటిస్ట్‌‌‌‌లు కూడా కనుక్కోలేని మిస్టరీలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ‘జోన్‌‌‌‌ ఆఫ్ సైలెన్స్‌‌‌‌’. దీన్నే ‘మ్యాపిమి సైలెంట్ జోన్’ అని కూడా అంటారు. ఇక్కడ రేడియో సిగ్నల్స్‌‌‌‌ ఉండవు. ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులు కూడా సరిగ్గా పనిచేయవు. ఇది ఎన్నో అద్భుతాలు, మిస్టరీలకు కేరాఫ్‌‌‌‌. బెర్ముడా ట్రయాంగిల్‌‌‌‌, డెవిల్స్‌‌‌‌ ట్రయాంగిల్‌‌‌‌ లాంటిదే ఈ చోటు కూడా. ఇది మెక్సికోలోని ‘బోల్సన్ డి మ్యాపిమో’ ప్రాంతానికి దగ్గరలో ఉంది.  దాదాపు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. టెక్సాస్‌‌‌‌లోని ఎల్‌‌‌‌పాసో నుంచి  650 కిలోమీటర్లు ప్రయాణిస్తే దీన్ని చేరుకోవచ్చు. మెక్సికోలోని బంజరుభూమిలో ఉన్న ఈ జోన్ గురించి ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ.. అక్కడికి వెళ్లడానికి మాత్రం ఎవ్వరూ సాహసం చెయ్యరు. అసలు ఆ జోన్ అంటే ఎందుకంత భయం? అక్కడ ఏముంది? అక్కడికి వెళ్లినవాళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? 

ఎప్పుడు తెలిసింది?
ఈ ప్రాంతం గురించి ఆ చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లకు తెలిసినా బయటి ప్రపంచానికి మాత్రం 1930ప్రాంతాల్లో తెలిసింది. ఫ్రాన్సిస్కో సరబియా అనే పైలట్‌‌‌‌ ఈ ప్రాంతం మీద నుంచి ఫ్లైట్‌‌‌‌ నడుపుతూ వెళ్తున్నాడు. సరిగ్గా జోన్ ఆఫ్‌‌‌‌ సైలెన్స్‌‌‌‌లోకి ఫ్లైట్‌‌‌‌ రాగానే రేడియా సిగ్నల్స్ నిలిచిపోయాయి. అయినా సరే! అని ఫ్లైట్‌‌‌‌ని ముందుకు నడిపాడు. అందులోని ఎలక్ట్రిక్‌‌‌‌ పరికరాలు సరిగ్గా పనిచేయలేదు. ఫ్లైట్‌‌‌‌ మాత్రం ఎగురుతూనే ఉంది. దాంతో ప్రాన్సిస్కోకి భయమేసి ఫ్లైట్‌‌‌‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌‌‌ చేశాడు. అప్పుడే ఈ ప్లేస్‌‌‌‌లో ఏదో ఉంది. ఇక్కడే సిగ్నల్స్ ఎందుకు పనిచేయడం లేదు? అనే అనుమానాలు చాలామందిలో కలిగాయి. కానీ.. ఈ సంఘటన మామూలుగానే కూడా జరిగి ఉండొచ్చు అనుకున్నారు కొంతమంది.  

పైప్‌‌‌‌లైన్‌‌‌‌ కోసం..
‘పెమెక్స్’ (పెట్రోలీస్‌‌‌‌ మెక్సికన్‌‌‌‌) 1964లో పైపులైన్‌‌‌‌ వేయాలనుకుంది. అందుకోసం ఆ సంస్థలోనే ఇంజినీర్‌‌‌‌గా పనిచేస్తున్న ‘హ్యారీ డి లా పెనా’ని నియమించింది. దాంతో ఆయన ఈ ప్రాంతంలో సర్వే చేయడానికి తన టీంతో వెళ్లాడు. కానీ.. అక్కడికి వెళ్లగానే రేడియా సిగ్నల్స్‌‌‌‌తో నడిచే వస్తువులు పనిచేయడం ఆగిపోయింది. ఏ డివైజ్‌‌‌‌కూ సిగ్నల్స్‌‌‌‌ అందడంలేదు. అది గమనించిన ఆయన ఈ ప్రాంతం గురించి రీసెర్చ్‌‌‌‌ చేసి.. రేడియో సిగ్నల్స్‌‌‌‌ రావడంలేదని అని తేల్చి చెప్పాడు. ఆయనే దీనికి ‘జోన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సైలెన్స్‌‌‌‌’గా పేరు పెట్టాడు. అప్పటినుంచి ఇక్కడ చాలామంది సైంటిస్ట్‌‌‌‌లు రీసెర్చ్‌‌‌‌ చేశారు. కానీ.. సిగ్నల్స్‌‌‌‌ రహస్యాన్ని కనుక్కోలేకపోయారు. కనీసం ఈ ప్రాంతంలోని సిగ్నల్‌‌‌‌ డెడ్‌‌‌‌ జోన్లను కూడా గుర్తించలేకపోయారు. అవి స్థిరంగా ఉండకుండా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదులుతున్నాయనే నిర్ధారణకు వచ్చారు సైంటిస్ట్‌‌‌‌లు. కానీ.. అలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే... హ్యారీ రీసెర్చ్‌‌‌‌ చేసిన రిపోర్ట్‌‌‌‌ విడుదల చేసిన తర్వాత ఈ ప్లేస్‌‌‌‌ మిస్టరీ గురించి అనేక కథలు పుట్టుకొచ్చాయి.

యుఎస్ రాకెట్ 
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత చాలా దేశాలు రక్షణ పరంగా బలాన్ని పెంచుకున్నాయి. అందులో భాగంగానే న్యూ మెక్సికోలోని ‘వైట్ సాండ్స్ మిస్సైల్​ బేస్‌‌‌‌’ నుంచి ఎథీనా ఆర్‌‌‌‌టివి (రీఎంట్రీ టెస్ట్ వెహికల్) రాకెట్లను ప్రయోగించింది. జూలై 11, 1970 న, ఎథీనా ఆర్టీవీ వీ–123డీ రాకెట్‌‌‌‌ని పంపించారు. అది రేడియో ఆక్టివ్‌‌‌‌ కోబాల్ట్ –-57 అనే క్యాప్సుల్‌‌‌‌ని మోసుకెళ్లింది. ప్లాన్‌‌‌‌ ప్రకారం అది చివరి దశలో న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ ఎడారిలో పడిపోవాలి. కాని ఆ రాకెట్​ ఎడారిలో కాకుండా గురితప్పి దాదాపు 500 మైళ్ళ దూరంలో ఉన్న ‘జోన్ ఆఫ్ సైలెన్స్‌‌‌‌’కి వచ్చి పడింది. కాస్త అటుఇటుగా అయితే పర్లేదు కానీ.. 500 మైళ్ల దూరంలో పడేసరికి ఎందుకలా జరిగిందని రీసెర్చ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికీ తేల్చలేకపోయారు. పైగా ఇక్కడ పడ్డ క్యాప్స్యూల్‌‌‌‌ కూడా చాలా రోజుల వరకు దొరకలేదు. తర్వాత మట్టిని తవ్వితే ఆ క్యాప్స్యూల్‌‌‌‌ శిథిలాలు దొరికాయి. 

రీసెర్చ్‌‌‌‌లు 
క్యాప్స్యూల్‌‌‌‌ ఇక్కడ పడిపోవడంతో యూఎస్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ ఈ జోన్‌‌‌‌ మీద రీసెర్చ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టింది. దాని చుట్టూ ఉన్న కథలను పట్టించుకోకుండా సైంటిస్ట్‌‌‌‌లు రీసెర్చ్‌‌‌‌ చేశారు. కొన్ని వారాల తర్వాత.. ఇక్కడ ఉన్న అయస్కాంత నిల్వలే కమ్యూనికేషన్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఉండకుండా చేస్తున్నాయని తేల్చారు. కానీ.. ఇలాంటి అయస్కాంత నిల్వలు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరి అక్కడ కమ్యూనికేషన్స్‌‌‌‌ బాగానే ఉంటున్నాయి? మరి ఇక్కడే ఎందుకు ప్రాబ్లం వస్తోంది? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. 

ఖనిజాలు, ఉల్కలు
జోన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సైలెన్స్‌‌‌‌లో రీసెర్చ్‌‌‌‌ చేసిన కొందరు సైంటిస్ట్‌‌‌‌లు ఇక్కడ మాగ్నెటైట్, యురేనియం ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ శాటిలైట్‌‌‌‌ సిగ్నల్స్ పనిచేయడం లేదని చెప్తున్నారు. యురేనియం, మాగ్నటైట్‌‌‌‌ ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. పైగా ఇక్కడ ఎలక్ట్రానిక్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు కూడా సరిగ్గా పనిచేయడంలేదు. ఈ ప్రాంతంలో రీసెర్చ్‌‌‌‌ చేసిన మరికొంతమంది రీసెర్చర్లు మాత్రం గతంలో ఇక్కడ ఉల్కలు పడ్డాయని అందువల్లే రేడియో సిగ్నల్స్ పనిచేయడంలేదని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంటున్న కొందరు ప్రజలు కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఆకాశం నుంచి ఏవేవో కాంతులు వెదజల్లుతూ పడతాయని చెప్పారు. ఇది ఆ రీసెర్చర్ల వాదనకు బలం చేకూర్చింది. అయితే... భూమి మీద ఉల్కలు పడ్డ ప్రాంతాలు బోలెడు ఉన్నాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఆ ప్రాంతాల్లో కూడా రేడియో సిగ్నల్స్ పనిచేయకూడదు. కానీ ఆ ప్రాంతాల్లో బాగానే పనిచేస్తున్నాయి. 

వింత మనుషులు 
ఈ జోన్‌‌‌‌లో ముగ్గురు వింత మనుషులు కూడా తిరుగుతారట! వాళ్లు ఎక్కడినుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? తెలియదు. చాలా ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారట. వీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు కనిపించరు. ఆ జోన్‌‌‌‌లోకి వెళ్లినవాళ్లలో  కొంతమందికి మాత్రమే కనిపిస్తారు. వాళ్లలో ఇద్దరు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. ముగ్గురూ వయసుపైబడినవాళ్లే. తెల్లని జుట్టు, ముడతలు పడిన శరీరంతో ఉంటారు. అప్పుడప్పుడు ఆ జోన్‌‌‌‌కి దగ్గరలో ఉన్న ఊళ్లోకి వచ్చి వెళ్తుంటారు. వచ్చిన ప్రతిసారి వాళ్లు నీళ్లు మాత్రమే తీసుకెళ్తుంటారు. ఏ ఇతర వస్తువులు కొనుక్కోవడం కానీ, తినడం కానీ ఇంతవరకు ఎవరూ చూడలేదు. వాళ్లని చూసి అందరూ భయపడుతుంటారు. ఒకసారి ఒక వ్యక్తి ధైర్యం చేసి.. ‘‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు?” అని అడిగాడు. దానికి వాళ్లు ‘‘పైనుంచి వచ్చాం.’’ అని సమాధానం చెప్పి వెళ్లిపోయారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వాళ్లు ఎప్పుడు ఆ వాతావరణానికి సరిపోని బట్టలే వేసుకుంటారు. అది ఎడారి ప్రాంతమైనా దళసరి కోట్లు వేసుకుంటారు. 

ఆ ఇద్దరు ఎవరు?
అక్టోబర్ 1975లో జరిగిన ఒక సంఘటన ఈ జోన్‌‌‌‌ మీద ఉన్న కొన్ని మిస్టరీలను నిజం చేసింది. ఇద్దరు పాజిల్ హంటర్స్‌‌‌‌ ఎర్నెస్టో, జోసెఫినా డియాజ్‌‌‌‌లు ఇక్కడ రీసెర్చ్‌‌‌‌ చేయడానికి వచ్చారు. రోజంతా రీసెర్చ్‌‌‌‌ చేసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే చీకటైంది. బాగా వర్షం కురుస్తోంది. రోడ్డు చిత్తడిగా మారింది. రోడ్డు మీదున్న గుంతలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇద్దరూ ట్రక్‌‌‌‌లో వెళ్తుండగా.. ట్రక్‌‌‌‌ టైర్ ఒక గుంతలో పడి ఇరుక్కుపోయింది. అప్పటికే వాళ్లు ఆ జోన్‌‌‌‌ గురించిన కథలు విన్నారు. కాబట్టి భయంతో ట్రక్‌‌‌‌ దిగకుండా ఉండిపోయారు. ఆ టైంలో ఒక నమ్మశక్యమైన ఘటన జరిగింది. మామూలు మెక్సికన్‌‌‌‌ ఉండే కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి ఆ ట్రక్‌‌‌‌కి ఎదురుగా వచ్చారు. ఇద్దరూ ఒకే రకమైన బట్టలు వేసుకున్నారు. పసుపు రెయిన్ కోట్, టోపీ పెట్టుకున్నారు. ట్రక్‌‌‌‌ దగ్గరకి వచ్చి ఏమీ మాట్లాడకుండా ట్రక్‌‌‌‌ని బురద గుంటలో నుంచి పైకి లేపారు. ఎర్నెస్టో ట్రక్‌‌‌‌ని ముందుకు పోనిచ్చాడు. డియాజ్‌‌‌‌ ఇదంతా చూస్తూ వణికిపోతోంది. ఎర్నెస్టో మాత్రం ట్రక్‌‌‌‌ని కాస్త ముందుకు తీసుకెళ్లి, నిలిపాడు. డోర్‌‌‌‌‌‌‌‌ తీసి బయటికొచ్చి ‘థ్యాంక్స్‌‌‌‌’ చెప్పడానికి వాళ్ల కోసం వెతికాడు. కానీ.. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ బురదలో వాళ్ల కాళ్ల ముద్రలు కూడా లేవు. ఇదంతా వాళ్లకు నమ్మలేని నిజంలా అనిపించింది. 

యూఎఫ్​ఓలు 
ఈ సైలెన్స్‌‌‌‌ జోన్‌‌‌‌కి యూఎఫ్​ఓ(అన్‌‌‌‌ఐడెంటిఫైడ్‌‌‌‌ ఫ్లైయింగ్‌‌‌‌ ఆబ్జెక్ట్‌‌‌‌)లు వస్తుంటాయని, అందులో ఏలియన్స్‌‌‌‌ వస్తాయని ఇక్కడివాళ్లు చెప్తుంటారు. అప్పుడప్పుడు యూఎఫ్‌‌‌‌ఓలు కనిపిస్తుంటాయని ఈ జోన్ దగ్గర్లో ఉన్న ఊళ్ల ప్రజలు చెప్తుంటారు. జోన్‌‌‌‌కు దగ్గర్లో ఉన్న సెబాలోస్లో టౌన్‌‌‌‌ ప్రజలు 1976 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రాత్రి టైంలో యూఎఫ్​ఓ చూశామని చెప్తున్నారు. అది దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉన్న పెద్ద యూఎఫ్‌‌‌‌ఓ ఆకాశంలో ఎగురుతూ కనిపించిందట. ఇది దాదాపు 300 మీటర్ల పొడవు ఉందని, దాని అంచులో రంగురంగుల లైట్లు మెరుస్తున్నాయని చెప్తున్నారు. కానీ.. అది కాసేపటికే అదృశ్యమైందట. అప్పటినుంచి ఈ జోన్‌‌‌‌కి గ్రహాంతరవాసులు వస్తుంటారని ఇక్కడివాళ్లు నమ్ముతున్నారు. జోన్ ఆఫ్ సైలెన్స్‌‌‌‌లో పారానార్మల్ యాక్టివిటీస్‌‌‌‌ ఉన్నాయని చాలామంది నమ్ముతున్నప్పటికీ చాలామంది ఇక్కడ రీసెర్చ్‌‌‌‌లు చేస్తున్నారు.

బయోస్పియర్ రిజర్వ్‌‌‌‌
అంతేకాదు ఇక్కడ అనేక రకాల అరుదైన జంతువులు, చెట్లు ఉన్నాయి. దాదాపు 31 జాతుల అరుదైన మొక్కలు, 75 రకాల జాతుల జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న దశలో ఉన్న ఎడారి తాబేలు లాంటివి కూడా ఉన్నాయి.  అందుకే గవర్నమెంట్‌‌‌‌ దీన్ని 1979లో ‘బయోస్పియర్ రిజర్వ్‌‌‌‌’ గా మార్చింది. దీనికి ‘మాపిమో బోల్సన్ బయోస్పియర్ రిజర్వ్‌‌‌‌’ అని పేరు పెట్టింది

::: కరుణాకర్​ మానెగాళ్ల