కేసీఆర్​ ప్రేమతో చీరలు ఇస్తే వంకలు పెడ్తరా? : జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి

కేసీఆర్​ ప్రేమతో చీరలు ఇస్తే వంకలు పెడ్తరా? : జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి
  • క్వాలిటీపై నిలదీసిన మహిళలపై మండిపడ్డ జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి

శాయంపేట, వెలుగు: ‘కేసీఆర్​ ప్రేమతో బతుకమ్మ చీర ఇస్తున్నడు..  కట్టుకోబుద్దయితే కట్టుకోండి.. లేదంటే లేదు..ఇన్ని వంకలు పెడ్తరా’ అని మహిళలపై వరంగల్ ​జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి మండిపడ్డారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం పంచాయతీ వద్ద బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ‘ఇలాంటి చీరలు ఇస్తారా’ అని నిలదీశారు. దీంతో అగ్రహించిన జ్యోతి ‘ఒక్కచీర తెచ్చుకునేందుకే బట్టల షాపుల నాలుగుసార్లు  తిర్లేసి.. మర్లేసి గంటల తరబడి చూస్తం.. ఏ రంగో, ఏ డిజైనో చూసి తెచ్చుకుంటం.. కానీ,2 కోట్ల 20 లక్షల మంది ఆడవాళ్లకు చీరలు పంపిణీ చేయాలంటే మాటలా? చీరల విషయంలో వారిని మెప్పించడం ఎవ్వరి వల్లా కాదు. నేను ఆడమనిషిగా చెప్తున్నా. కేసీఆర్​ ప్రేమతో ఇచ్చిన చీరలు తీసుకోండి.. వంకలు పెట్టకండి’ అని అన్నారు. మీకిష్టముంటే కట్టుకోండి ఇష్టం లేకపోతే పక్కకు పెట్టుకోండంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గతంలో పోలిస్తే పెరిగిన వెరైటీలు

బతుకమ్మ చీరల్లో వైవిధ్యం కనిపించాలని మంత్రి కేటీఆర్​ సూచించడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ రంగుల్లో చీరలను ఉత్పత్తి చేశారు. 2017లో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నేపథ్యంలో నేత కార్మికులకు ఉపాధినివ్వడం కోసం బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లను మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు కేటాయించారు. మొదట్లో నాసిరకం చీరలు వచ్చాయంటూ విమర్శలు రాగా, తర్వాత నుంచి మార్పులు చేస్తూ వస్తున్నారు. గతేడాది కేవలం 10 రంగుల్లో,19 డిజైన్లలో 190 వెరైటీల్లో బతుకమ్మ చీరలను రూపొందించగా ఈసారి పది రంగులను 25కు,19 డిజైన్లను 25కు, వెరైటీలను 190 నుంచి 525 కు పెంచారు.  

అన్ని జిల్లాల్లో పంపిణీ

బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. ఒకటి రెండు రోజుల్లో పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ యేడు 525 వెరైటీల్లో చీరలు తయారు చేయించాం. నాణ్యత కూడా పెరిగింది. ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా అందించే చీరలు ఆకట్టుకోనున్నాయి.  

- సాగర్ , చేనేత జౌళి శాఖ ఏడీ

నేత కార్మికులకు ఉపాధి

బతుకమ్మ చీరల ద్వారా సిరిసిల్లలోని పవర్​లూమ్​నేత కార్మికులు సుస్థిర ఆదాయం పొందుతున్నారు. గతంలో  కంటే ఆకర్షణీయంగా బతుకమ్మ చీరలను తీర్చిదిద్దాం.  

- గూడూరి ప్రవీణ్ , రాష్ట్ర పవర్ లూమ్,

  టెక్స్ టైల్ కార్పొరేషన్​చైర్మన్​