
- ఇందులో 2 ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ
- 3 జనరల్ స్థానాల్లో పురుషులతో పోటీపడే చాయిస్
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించే జడ్పీ చైర్‍పర్సన్ పోస్టుల రిజర్వేషన్లు ఈసారి మహిళలకు మహావకాశాన్ని కల్పించాయి. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి 6 జడ్పీ చైర్‍పర్సన్ పోస్టులు ఉండగా, మూడుచోట్ల డైరెక్టుగా మహిళలకే రిజర్వేషన్ కలిసివచ్చింది. మిగతా మూడుచోట్ల సైతం ఏదో ఒక సామాజికవర్గం నుంచి జనరల్ కావడంతో గత ఎన్నికల్లో గండ్ర జ్యోతి తరహాలో పురుషులతో పోటీపడి జడ్పీపీఠం సాధించే అవకాశం వచ్చింది.
కాగా, రాష్ట్ర కెబినెట్‍లో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, ధరసరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు జడ్పీ చైర్ పర్సన్ రూపంలో మరోసారి మహిళలకు ఓరుగల్లులో ఎక్కువ రాజకీయావకాశాలు రానున్నాయి.
రెండింట్లో జనరల్ రిజర్వేషన్‍కు కోత..
ఉమ్మడి వరంగల్ 6 జడ్పీ చైర్‍పర్సన్లలో ఈసారి హనుమకొండ, జనగామ జిల్లాలు ఎస్సీ (మహిళ)లకు రిజర్వేషన్ రావడంతో ఇద్దరు మహిళామణులకే అవకాశం ఉంది. ములుగు ఎస్టీ (మహిళ) రిజర్వేషన్ రూపంలో మరో మహిళతో కలిపి డైరెక్టుగా ముగ్గురు మహిళలు జడ్పీ చైర్‍పర్సన్లుగా ఎన్నికవనున్నారు. మిగిలిన మూడు స్థానాలైన మహబూబాబాద్ జిల్లా (జనరల్), భూపాలపల్లి (బీసీ జనరల్), వరంగల్ (ఎస్టీ జనరల్) స్థానంలో సైతం మహిళలు అదృష్టం పరీక్షించుకోడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వరంగల్ రూరల్ (జనరల్) స్థానం నుంచి మహిళగా గండ్ర జ్యోతి విజయం సాధించారు.
ఇప్పుడు ఎస్సీ మహిళకు డైరెక్టుగా జడ్పీ చైర్‍పర్సన్‍గా ఎన్నికయ్యే అవకాశం ఈ రిజర్వేషన్‍లో కలిసివచ్చింది. 2019 ఎన్నికల్లో ఎస్సీ (మహిళ) కోటా భూపాలపల్లి నుంచి మాత్రమే ఉండగా, ఈసారి మరో స్థానం పెరిగింది. అప్పటి ఎన్నికల్లో జనగామ, ములుగు జిల్లాలు (జనరల్) కోటాలో ఉండగా, ఈసారి ఒక్కటి తగ్గి కేవలం మహబూబాబాద్ జిల్లా ఒక్కటే (జనరల్) స్థానమైంది. దీంతో జనరల్ రిజర్వేషన్ కోత పడి ఎస్సీ (మహిళ) కోటాలో మహిళకు డైరెక్టుగా రెండో అవకాశం వచ్చినట్లయింది.
రిజర్వేషన్లు అప్పడు అలా ఇప్పుడు ఇలా..
జిల్లా పేరు 2019 2025
వరంగల్ అర్బన్(హనుమకొండ) ఎస్సీ (జనరల్) ఎస్సీ (మహిళ)
వరంగల్ రూరల్(వరంగల్) జనరల్(మహిళ) ఎస్టీ (జనరల్)
జనగామ జనరల్ ఎస్సీ (మహిళ)
మహబూబాబాద్ ఎస్టీ (మహిళ) జనరల్
భూపాలపల్లి ఎస్సీ (మహిళ) బీసీ (జనరల్)
ములుగు జనరల్ ఎస్టీ (మహిళ)