జడ్పీ సమావేశం రసాభాస

జడ్పీ సమావేశం రసాభాస
  •     అధికార, విపక్ష సభ్యుల  మధ్య వాగ్వాదం 
  •     సభ్యులను సముదాయించిన చైర్మన్

నల్గొండ అర్బన్, వెలుగు : జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. రైతుబంధు విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం నల్గొండ జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో జేడీఏ శ్రావణ్​సభ్యులకు వివరాలు చెబుతుండగా బీఆర్ఎస్​ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి జోక్యం చేసుకొని 3‌‌-4 ఎకరాల్లోపు రైతులకే రైతుబంధు వేశారని, కాంగ్రెస్​ పాలనపై విమర్శలు చేశారు. 

వెంటనే జడ్పీ ఫ్లోర్​లీడర్​పాశం రాంరెడ్డి, కాంగ్రెస్​సభ్యులు స్పందిస్తూ తిప్పన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ చైర్మన్​మాట్లాడుతూ ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించాలే తప్ప రాజకీయాలు చేయొద్దని చెప్పారు. వ్యవసాయశాఖ  సమీక్షలో రైతుబంధు పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రావణ్ సమాధానం ఇచ్చారు. 

వేసవిలో ప్రజలకు  తాగునీరు సరఫరా, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జడ్పీటీసీలు, ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.