ఆసిఫాబాద్ లో సీరియస్​గా సాగిన జడ్పీ మీటింగ్

ఆసిఫాబాద్ లో సీరియస్​గా సాగిన జడ్పీ మీటింగ్

ఆసిఫాబాద్, వెలుగు :  జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్ లో జడ్పీ చైర్​పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన జడ్పీ మీటింగ్​ సీరియస్​గా సాగింది. అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందెవెల్లి బ్రిడ్జి కూలిపోయి పదిహేను రోజులు గడుస్తున్నా ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటి వరకు ప్రతిపాదనలు తయారు చేయలేదని, ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడ్డారు. 42 గ్రామాల్లోని 50 వేల మంది ప్రజలకు రాకపోకలు నిలిచిపోయినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని సీరియస్​ అయ్యారు. టెండర్లు దక్కించుకుంటూ పనులు చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్ కమలోద్దిన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని గతంలో జరిగిన జడ్పీ మీటింగ్ లో తీర్మానించినా ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. మళ్లీ అతనే  నియోజకవర్గ పరిధిలో 10 బ్రిడ్జిలకు టెండర్లు దక్కించుకున్నారని, జిల్లాలో పనులు చేయకుండా నిలిపివేయాలని ఆదేశించారు. హెల్త్​ డిపార్ట్​మెంట్​లో ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇలాంటి ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలని గ్రంథాలయ చైర్మన్ యాదవ్ రావు ఫైర్ అయ్యారు. ఏజెన్సీ గిరిజన మండలమైన తిర్యాణి గ్రామానికి ఇప్పటికీ రోడ్డు లేదని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు వల్ల ప్రజలు తమను తిడుతున్నారని వాపోయారు. 

 అభివృద్ధికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి: కలెక్టర్ రాహుల్ రాజ్..

అభివృద్ధి కోసం అధికారులు కలిసి పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులకు సంబంధించి టెండర్లు దక్కించుకొని పనులు చేయని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. అందవెల్లి బ్రిడ్జి పనులను త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. అది పూర్తయ్యే వరకు తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. జిల్లాకు మెడికల్​ కాలేజీ మంజూరైందని , దీంతో రానున్న రోజుల్లో జిల్లాలో వైద్య సేవలు మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది ఎంపికలో నిర్లక్ష్యం వహించకూడదని, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దానిని పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో అక్రమ లేఔట్ లు తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. హెల్త్ డిపార్ట్​మెంట్​లో త్వరలోనే ఏఎన్ఎం లను భర్తీ చేస్తామని చెప్పారు. 

ఆఫీసర్లు బాధ్యతగా పని చేయాలె: జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి

అభివృద్ధి పనుల పట్ల ఉన్నతాధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కొన్ని రహదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని దానికి ఎంపీపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సంక్షేమ పథకాలు మండలాల్లో అర్హులకు దక్కేలా చూడాలని  ప్రజాప్రతినిధులకు సూచించారు.

వెల్ఫేర్​ హాస్టల్​లో బాలికలు ఆరుబయట స్నానాలు చేస్తున్నారు 

కోహినూర్ ట్రైబల్ వెల్ఫేర్​ హస్టల్ లో ఏడాది క్రితం మంజూరైన బాత్​రూమ్​లు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో బాలికలు ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు. ఐటీడీఏ అధికారులు ఏం చేస్తున్నారు? గిరిజన బాలికలు ఆరుబయట స్నానాలు చేస్తుంటే ఏడాది నుండి ఎందుకు పనులు కంప్లీట్ చేయడం లేదు. చాలా హస్టళ్లలో ఇదే పరిస్థితి ఉంది. 

‌‌- కోవ అరుణ ,జడ్పీటీసీ, సిర్పూర్ యు