జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు మొక్కుబడిగా మారుతున్నాయి. రెండు నెలలకు ఒకసారి మీటింగ్ లు జరుగుతున్నా సమస్యలు మాత్రం తీరడంలేదు. జిల్లా పరిషత్ లో మొత్తం ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. జడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఆయా మండలాల జడ్పీటీసీలు అధ్యక్షులుగా విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, సాంఘీక సంక్షేమ, ఆర్థిక, ప్రణాళిక, పనుల స్టాండింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుండగా, స్టాండింగ్ కమిటీలు మీటింగ్‌లు రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని స్టాండింగ్ కమిటీ సమావేశాల ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో శ్రద్ధ చూపడం లేదు. మీటింగ్ జరిగిందా, వచ్చామా, పోయామా అన్నట్టు మారింది పరిస్థితి. అంతేగాక ఒకరోజు మూడు, మరో రోజు నాలుగు స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడం వల్ల సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించలేకపోతున్నారు.
నేడు, రేపు మీటింగ్‌లు..
జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లు ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజులు జరుగనున్నాయి. తొలిరోజు బుధవారం వ్యవసాయం, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘీక సంక్షేమం, రెండో రోజు గురువారం గ్రామీణాభివృద్ధి, విద్యా, ఆరోగ్యం, ఆర్థిక, ప్రణాళిక, పనుల స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కాగా మీటింగ్‌లు మొక్కుబడిగా జరుగకుండా, ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, నెలకొన్న సమస్యలపై సమగ్ర చర్చ జరిగి, ఆయా రంగాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేలా, నిర్దేశిత వర్గాల ప్రజలకు మేలు కలిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవీ సమస్యలు..
జిల్లాలో విద్య, వైద్య, స్త్రీ, శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పనులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గదుల కొరత, తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, కిచెన్ షెడ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం మొక్కుబడిగా అమలవుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో సమస్యలు ఎక్కువగా ఉన్న313 పాఠశాలలను ఎంపిక చేయగా, వివిధ పనులు చేపట్టేందుకు రూ.53 కోట్ల అంచనాతో ప్రపోజల్స్ రూపొందించి పంపించారు. అయితే పూర్తి స్థాయిలో ఫండ్స్ రాకపోవడం వల్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. అలాగే వంట బిల్లులు అందక పోవడంతో స్కూల్ లలో మధ్యాహ్న భోజన నిర్వహణ అధ్వాన్నంగా మారింది. తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేయగా, సరిపడా డాక్టర్లు, స్టాఫ్ లేక, అవసరమైన పరికరాలు, సౌకర్యాలు అందుబాటులోకి రాక ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్సీలలోనూ అంతంత మాత్రం సేవలే అందుతుండగా, కొత్త మండలాల్లో పీహెచ్‌సీలు లేక ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షే అవుతున్నాయి. క్రీడలను ప్రోత్సహించేందుకు జిల్లాలోని 469 గ్రామాల్లో , నాలుగు మున్సిపల్ పట్టణాల్లోని 75 వార్డుల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, జిల్లా అంతటా కలిపి 50 కూడా ఏర్పాటు కాలేదు. వాటిని ఏర్పాటు చేసిన చోట కూడా సౌకర్యాలు సమకూరలేదు. గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పేందుకు ఊరూరా సెగ్రిగేషన్ షెడ్ లు నిర్మించినప్పటికి, నిర్వహణ లోపం వల్ల మెజారిటి గ్రామాల్లో నిరుపయోగంగా మారాయి. అలాగే చనిపోయిన వారి అంతిమ సంస్కారాల కోసం గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాలు ఇంకా చాలా చోట్ల వినియోగంలోకి రాలేదు. పచ్చదనాన్ని పెంపొందింపజేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా, కనీస వసతులు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. భోజనం మెనూ కూడా సరిగా అమలుకాక, విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావడంలేదు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి, బ్రిడ్జీలు, చెక్ డ్యాం నిర్మాణ పనులు, రూర్బన్ స్కీం కింద పాపన్నపేట మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక రోడ్లు దెబ్బతిని వెహికిల్స్ రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అవసరమైన నిధులు మంజూరు చేసి, త్వరిత గతిన పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి...
అడిషనల్ కలెక్టర్ రమేష్
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రమేశ్ అన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మంగళవారం ఆయన స్టూడెంట్లతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జనవరి 1న ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు ఒక్కసారి మాత్రమే ఓటరుగా నమోదుకు అవకాశముండేదని, కానీ భారత ఎన్నికల కమిషన్ ఎక్కువ మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఏటా జనవరి , ఏప్రిల్ , జులై , అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పిస్తోందని వివరించారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్వీప్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఆర్డీవో సాయిరామ్, జడ్పీ సీఈవో వెంకట శైలేష్, ఈడీఎం సందీప్, ఎలక్ట్రోరల్ లిటరసి నోడల్ అధికారులు, క్యాంపస్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్మశాన స్థలంలో క్రీడా ప్రాంగణం వద్దు
పనులు అడ్డుకున్న దేవులపల్లి గ్రామస్తులు
శ్మశానం కోసం ఇచ్చిన స్థలంలో క్రీడా ప్రాంగణం నిర్మించడాన్ని నిరసిస్తూ దేవులపల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల కిందట సర్వేనెంబర్ 117లో శ్మశానం కోసం ఎస్సీలకు రెండెకరాలు, బీసీలకు రెండున్నర ఎకరాలు కేటాయించారని, బీసీలకు కేటాయించిన స్థలంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం నిర్మించారని తెలిపారు. ఎస్సీలకు కేటాయించిన రెండెకరాల స్థలంలో క్రీడా ప్రాంగణం కడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ స్టేడియం కడితే తమకు శ్మశానం కూడా లేకుండా పోతుందని ఆవేదన చెందారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజమణి, హరితలు అక్కడికి వచ్చి ఆ భూమి కూకుట్ల పల్లి బీని అటవీ భూమి అని, అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి వీలులేదని సర్పంచ్, కార్యదర్శి చెప్పామన్నారు. అక్కడ క్రీడా ప్రాంగణం నిర్మించొద్దని సూచించామని తెలిపారు.
ప్రజల్లో మంచి పేరు వచ్చేలా విధులు నిర్వహించాలె
ప్రజల్లో మంచి పేరు వచ్చేలా పోలీసులు విధులు నిర్వహించాలని సీపీ ఎన్ శ్వేత సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆమె సందర్శించారు. స్టేషన్ చుట్టూ పరిసరప్రాంతాలలో నాటిన మొక్కలను, వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. మూడు ఏండ్ల నుంచి నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైమ్ రేటు తగ్గించేలా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వీపీఓలు వారంలో రెండు మూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి, ప్రజల సమస్యలపై ఆరా తీయాలని, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ సీఐ భాను ప్రకాష్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సైదా నాయక్, ఎస్ఐ కొమురయ్య, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతి రెడ్డి, పాపయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు
తెలంగాణ రైతు సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సభ మునిదేవునిపల్లి లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో జయరాజు మాట్లాడారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ పంటను కోసుకెల్లడానికి జమీందారు రామచంద్ర రెడ్డి తన అనుచరులను పంపాడని, అప్పటికే సంఘంలో పనిచేస్తున్న భీమ్ రెడ్డి, నరసింహారెడ్డి, చర్ల ప్రతాప్ రెడ్డి, రామచంద్రరెడ్డి 30 మంది నాయకత్వంలో వాళ్లను తరిమినట్టు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం బడుగు బలహీన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, సాయుధ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో అసైన్ మెంట్ భూసమస్య పరిష్కరించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, రాజయ్య,గ్రామ రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ విమోచనంలో పటేల్ కృషి కీలకం
పోలీసు చర్య, రాజకీయ చతురతతో నిజాంను కట్టడి చేసి తెలంగాణకు స్వేచ్ఛ మార్గాన్ని చూపిన నేత సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సంస్థాన ప్రజల స్వేచ్చవాయువులు కల్పించడంలో ఆపరేషన్ పోలో కీలక ఘట్టం అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాకలో మంగళవారం పటేల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరపడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకోజు ప్రవీణ్, తొగుట రవీందర్, వెంకట్‌రెడ్డి, గాజుల భాస్కర్, బోయ రాజశేఖర్, కొండె ఎల్లారెడ్డి, బెజ్జంకి సప్తగిరి, బావాజీ రాజేశ్, పల్లె నిహాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాం మెడలు వంచి...
నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వేచ్ఛ అందించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో భాగంగా హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించిన రోజును పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉడత మల్లేశం, కోడూరు నరేష్, రోశయ్య, మల్లమ్మగారి శ్రీనివాసరెడ్డి, గుండ్ల జనార్ధన్, తొడుపునూరి వెంకటేశం, గోనె మార్కండేయులు, అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత విముక్తికి...
తెలంగాణ ప్రాంత విముక్తికి ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో విజయవంతం కావడంతో నిజాం లొంగిపోయాడని మెదక్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీలు నల్లాల విజయ్‌కుమార్, బానప్పగారి సుధాకర్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్, జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ బెండె వీణ, నాయకులు కాశీనాథ్, ప్రభాకర్ రెడ్డి, గోవిందరాజ్, నాగేందర్, శ్రీనివాస్, జంగం శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, సతీష్, ఆకుల రాము, చింతల మల్లేశం, శేఖర్, లావణ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి - మంత్రి హరీశ్ రావు...
మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మంగళవారం అసెంబ్లీ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, ఇందుకు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వజ్రోత్సవాల విజయవంతానికి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా 15 వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నామని, దీనికోసం 10 వేల చిన్న, 50 వేల పెద్ద జెండాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 17 న జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండా ఆవిష్కరణ, 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సమీక్షలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మదన్ రెడ్డి, మాణిక్ రావు, ఒడితెల సతీశ్, క్రాంతి, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ చింత ప్రభాకర్, మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్, సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజిమిల్ ఖాన్, గడా ఛైర్మెన్ ముత్యం రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణా జాతీయ సమైక్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం జహీరాబాద్ మున్సిపల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్, డీఎస్పీ రఘు,ఆర్డీవో రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విలీనదినంగా జరపాలి...
సీఐటీయూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విలీన దినోత్సవంగా జరపాలని సీఐటీయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్మల్లికార్జున్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం కేవలం రైతులు, కూలీలు, పేద ప్రజలు కలిసి దొరలు, జమీందారులు, జాగిర్దారుల మీద కమ్యూనిస్టు జెండా పట్టుకొని చేసిన పోరాటమని, భూములను పంచేందుకు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దీనిని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీలు మహేందర్ రెడ్డి, బస్వరాజు, ఉపాధ్యక్షులు మల్లేశం, నాగరాజు, సహాయ కార్యదర్శులు బాలమణి, నాగేందర్ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ
పాల్గొన్నారు.
