ఇసుక అక్రమాలపై విరుచుకుపడ్డ జడ్పీటీసీ, ఎంపీపీలు

ఇసుక అక్రమాలపై విరుచుకుపడ్డ  జడ్పీటీసీ, ఎంపీపీలు
  • అధికారులపై ​​గరం.. గరం..
  • ఇసుక అక్రమాలపై విరుచుకుపడ్డ  జడ్పీటీసీ, ఎంపీపీలు 
  • మైనింగ్​, ఫారెస్ట్​, ఎస్సీ, వైద్య శాఖల పనితీరుపై ఫైర్​  
  • మీటింగ్​కు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 
  • కలెక్టర్​ఎందుకు రాలేదు.. పిలిపించండి..
  • అధికారులూ..‘జడ్పీ’ గౌరవాన్ని కాపాడండి : ఎంపీ రాములు

నాగర్​ కర్నూల్, వెలుగు:  
పాలెం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఆడిటోరియంలో గురువారం జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి అధ్యక్షతన జరిగిన జడ్పీ మీటింగ్ హాట్​.. హాట్​గా సాగింది. అధికారుల పనితీరుపై జడ్పీ సభ్యులు విరుచుకుపడ్డారు. ఇసుక రవాణా, పోడు భూములు, దళితబంధు, వైద్యశాఖల నిర్లక్ష్యంపై ఫైర్​అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్​కు డుమ్మా కొట్టగా, హాజరైన ఎంపీ రాములు  కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు  రాకుండా ‘యాక్షన్ టేకెన్’​ రిపోర్ట్ ఎందుకని  అధికారులను ప్రశ్నించారు. ముందుగా కలెక్టర్​హాజరు కాకపోవడంతో ఫోన్ చేసి పిలిపించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. వివిధ అంశాలపై జడ్పీటీసీ మెంబర్లు,  ఎంపీపీలు  అధికారులను నిలదీస్తూ చెమటలు పట్టించారు.

ఇసుక అక్రమ రవాణాను ఆపలేరా?
మైనింగ్​శాఖపై సమీక్ష సందర్భంగా ఇసుక అక్రమ రవాణాపై  ఎంపీ రాములతో పాటు జడ్పీటీసీ మెంబర్లు  భరత్ ప్రసాద్, అనంత ప్రతాప్ రెడ్డి, విజితా రెడ్డి, కేవీఎన్​రెడ్డి, కొమ్ము మధు, కో ఆప్షన్  మెంబర్​హమీద్ మైనింగ్ ఏడీ విజయ రామరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. పేదలు ఇండ్లు కట్టుకుందామంటే..  ఇసుక పర్మిషన్​లేదంటరు.. వాగుల్లో రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు అడ్డగోలుగా తోడేస్తుంటే ఏం చేస్తున్నారని  ప్రశ్నించారు.  ‘మైనింగ్, ఇసుక ద్వారా వచ్చే ఆదాయం లెక్కల్లో  గోల్​మాల్​జరుగుతోందన్న అనుమానం వస్తోంది.  వాగుల్లోకి వెళ్లి చెక్ చేద్దాం. వస్తారా? ’ అని సభ్యులు అధికారులకు చాలెంజ్​ చేశారు. ‘శ్లాట్​బుక్​చేస్తే  నెలలు గడిచినా ఇసుక రాదు. కానీ.. ఇల్లీగల్​గా  అయితే గంటలోపు ఇంటి ముందు ఉంటుంది. ఇదేం పాలనో అర్థమైతలేదు. ’ అని  అసహనం వ్యక్తం చేశారు.   ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేక నవ్వులపాలవవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రాములు మేడిపూర్ వద్ద ఇసుక రీచులను  సీజ్ చేయాలని అధికారులను  ఆదేశించారు.  సభ్యుల ఆందోళనపై స్పందించిన కలెక్టర్  ఇసుక డెలివరీ లేట్ కావొద్దని అధికారులను ఆదేశించారు.  మైనింగ్​పై చర్చ  నడుస్తుండగా  పదర జడ్పీటీసీ  మెంబర్​ రాంబాబు ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్ల  నిర్మాణానికి  ఫారెస్ట్ ఆఫీసర్లు  పర్మిషన్​ఇవ్వాలని ప్లెక్సీతో  వేదిక ముందు  బైఠాయించారు. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ రివ్యూ స్టార్ట్ కాగానే అటవీశాఖ అంటే  హరితహారం, మొక్కలు నాటుడు  తప్ప వేరు పనులు ఉండవా? అని అమ్రాబాద్  ఎంపీపీ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఏం పనులు చేస్తున్నారో చెప్పకుండా పాత కాగితాలను తిప్పేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారని కేవీఎన్​రెడ్డి ప్రశ్నించారు.60 ఏండ్ల నుంచి భూములు సాగుచేసుకుంటున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు సతాయిస్తున్నరని పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ బౌరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.  

నేను వెళ్తేనే పట్టించుకోలే..
జిల్లాలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. తానే స్వయంగా జిల్లా ఆస్పత్రికి వెళ్తే  డ్యూటీ డాక్టర్లు కూడా పట్టించుకోలేదని, అడిగిన దానికి కనీసం సమాధానం ఇవ్వలేదని జడ్పీ చైర్ పర్సన్​పద్మావతి వేదికపైనే కలెక్టర్​తో చెప్పారు.    జిల్లా ఆస్పత్రి, పీహెచ్​సీల పనితీరుపై పలువురు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రి  అభివృద్ధి కమిటీ ఏర్పాటుపై వైద్యాధికారులను నిలదీశారు. మూడేండ్లు కమిటీ వేయకుండా స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు.  డీసీహెచ్​రమేశ్​, డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​సమాధానాలతో సభ్యులు శాంతించలేదు. దళిత బంధు , యూనిట్లు గ్రౌండింగ్​ విషయంలో అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాని పలువురు సభ్యులు ఆరోపించారు.  విద్యుత్, వ్యవసాయంపై కూడా చర్చ జరిగింది. జడ్పీ మీటింగ్ ​మొక్కుబడిగా మారుతోంది.  జడ్పీని చాయ్, పానీ భేటీ లా మార్చారు. అధికారులు పాత సమాచారాన్నే తిరగేసి ఇస్తున్నారు. ‘జడ్పీ’ అంటే తమాషా అనుకుంటున్రా.. మీటింగ్​కు కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్లు తప్పక రావాలి.  జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై సమీక్ష చేయాల్సిన సమా వేశం ఇది. ’ అని నాగర్​ కర్నూల్​ ఎంపీ రాములు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.