జీపీ నిధుల చెల్లింపులో మర్మమేంటో తేల్చాలి

జీపీ నిధుల చెల్లింపులో మర్మమేంటో తేల్చాలి

సిద్దిపేట, వెలుగు : గ్రామ పంచాయయితీ నిధుల చెల్లింపులపై సిద్దిపేట జిల్లా పరిషత్​ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన వ్యాఖ్యాలపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో  జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు  మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ నిర్వహణకు సంబంధించి ఒక్కో గ్రామానికి ఓ ప్రైవేటు సంస్థకు రూ.3.50 లక్షల చొప్పున చెల్లించారు. జిల్లాలో దాదాపు 300 గ్రామ పంచాయతీల్లో  సెక్రటరీలతో సంతకాలు చేయించి చెక్కులు తీసుకున్నారు. చెల్లింపులపై ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఈ విషయం జిల్లా అధికారులకు తెలుసా?  కనీసం డీపీవోకు అయినా సమాచారం ఉందా? దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’ అని డిమాండ్​ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో  11 గ్రామాల నుంచి శానిటేషన్ పేరిట డబ్బులు డ్రా చేశారని తెలిపారు. చిన్న గ్రామ పంచాయతీ ఆకారంలో ఇలాంటీ సంఘటన జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. దీనిపై తనకు ఎలాంటీ సమాచారం లేదని డీపీవో దేవకీదేవి తెలిపారు. వెంటనే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పందిస్తూ వారం రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి వివరాలు తెప్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు కలుగజేసుకొని సీఎం, మంత్రి హరీశ్​రావు దీని వెనుక ఉన్నారనే అర్థం వచ్చేలా ఎమ్మెల్యే మాట్లాడటం తగదని, ఆధారాలుంటే చూపాలని వాగ్వావాదానికి దిగారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ తాను ఎవరి పేరు చెప్పలేదని, ముఖ్యులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశానని అన్నారు. కొద్దిసేపు ఇదే వాగ్వాదం కొనసాగింది. అనంతరం విద్యా శాఖపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్ల   స్టూడెంట్స్​కు  బుక్స్, డ్రెస్ లు అందడం లేదని, కొండాపూర్​లోని పాఠశాలకు నాలుగు అదనపు తరగతి గదులు కావాలని నాలుగు సమావేశాలల నుంచి చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల టీచర్లను మొదట దుబ్బాక నియోజకవర్గంలోనే పోస్టింగ్ ఇవ్వాలని, ఆ తరువాతే మిగతా వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని, దీనికి సంబంధించిన వివరాలు కావాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో డీఈవో శ్రీనివాసరెడ్డి వివరాలను అందజేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న జర్నలిస్టు పిల్లలకు రాయితీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ విషయం లో  సర్క్యులర్ జారీ చేసినా పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ప్రస్తావించారు. దీనికి డీఈవో శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ జర్నలిస్టుల పిల్లలకు ఫీజు​లో 50 శాతం రాయితీ ఇచ్చే లా చూస్తానని హామీ ఇచ్చారు. 

పలు సమస్యలపై చర్చ..

రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి మాట్లాడుతూ మండలానికి రెగ్యులర్ ఏఓ లేక రైతులకు ఇబ్బంది కలుగుతోందనే సమావేశం దృష్టికి తెచ్చారు. త్వరలోనే రెగ్యులర్ ఏఓను పంపిస్తామని డీఏఓ శివప్రసాద్ చెప్పారు. మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు మాట్లాడుతూ రైతులకు సరఫరా చేసిన  ఆయిల్ పామ్ మొక్కలు కొన్ని  పాడయ్యాయని, వాటికి బదులుగా మరికొన్ని మొక్కలు ఇవ్వాలని కోరారు. దీనిపై జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ మాట్లాడుతూ మంత్రి హరీశ్​ రావు తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  సబ్జెక్టు టీచర్ల కొరత ఉందన్నారు.  దీనికి డీఈవో స్పందిస్తూ టీచర్ల లభ్యతను బట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వర్గల్ ఎంపీపీ లత మాట్లాడుతూ మండలంలోని వేలూరులో స్థలం లభించినందున రైతు వేదిక నిర్మించాలని కోరగా, పరిశీలిస్తామని జడ్పీ చైర్ పర్సన్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్​ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి సగం సభ్యులు రాలే.. 

జిల్లా సమస్యలపై చర్చించే సమావేశానికి పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. మొత్తం 40 మందికిపైగా సభ్యులు ఉంటే మీటింగ్​కు  10 మంది జడ్పీటీసీ సభ్యులు, తొమ్మిది మంది ఎంపీపీలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. మూడు నెలలకోసారి జరిగే సమావేశానికి సభ్యులు సమయం కేటాయించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రెండు సెషన్ల సమావేశంలో కొన్ని శాఖలకు సంబంధించిన అంశాలే ప్రస్తావనకు వచ్చాయి.