
హైదరాబాద్, వెలుగు: జైడస్ లైఫ్‌సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన సరోగ్లిటజార్ మందు ప్రైమరీ బైలరీ కొలాంగైటిస్(పీబీసీ) ఉన్న రోగుల చికిత్సకు ఉపయోగపడుతుందని ఆ సంస్థ చైర్మన్ పంకజ్ పటేల్ తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. పీబీసీ ఆటో ఇమ్యూన్ వ్యాధి.
ఇది క్రమంగా పిత్త వాహికలను నాశనం చేస్తుంది. దీని వల్ల కాలేయంలో పిత్తం పేరుకుపోయి, కాలేయం దెబ్బతింటుంది. ఈ పరిస్థితి చివరికి ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిశోధనల ఆధారంగా 2026 మొదటి క్వార్టర్లో యూఎస్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేయాలని జైడస్ యోచిస్తోంది.