
టీమిండియా ఎన్నో సిరీస్‌లు, టోర్నమెంట్‌లు గెలిచినప్పటికీ 2011లో నెగ్గిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మాజీ సారథి ఎంఎస్ ధోని నాయకత్వంలో సచిన్, యువరాజ్, జహీర్, సెహ్వాగ్, హర్భజన్, నెహ్రా లాంటి సీనియర్ల రాణింపుతో కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. తద్వారా 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ విషయాన్ని అటుంచితే.. ఆ టోర్నీలో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమేం జరిగిందనే దాని గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఓ స్టోరీని టీమిండియా మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రివీల్ చేశాడు.
ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ముందు సెక్స్ చేయాలని జట్టు ప్లేయర్లకు సూచించానని ఆప్టన్ చెప్పాడు. ఆటగాళ్లలో నెర్వస్‌నెస్‌ను పోగొట్టేందుకు ఈ సలహాను ఇచ్చానని పేర్కొన్నాడు. అయితే ఈ సూచనకు గానూ అప్పటి భారత కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు క్షమాపణలు చెప్పానన్నాడు. శృంగారం వల్ల ప్లేయర్లలో నూతనోత్తేజం వస్తుందని, ప్రదర్శన మెరుగవుతుందని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీతోపాటు 2009లో చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా ఆటగాళ్లను సెక్స్ చేయాల్సిందిగా సూచించానని తాను రచించిన ‘ది బేర్‌ఫుట్ కోచ్’ అనే పుస్తకంలో ఆప్టన్ రాసుకొచ్చాడు.