
డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది. ఒక మహిళ అనారోగ్యానికి కారణాన్ని గుర్తించి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని శ్రేయ అనే అమ్మాయి ఎక్స్ వేదికగా పంచుకుంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం.. శ్రేయ తల్లి ఒకటిన్నరేండ్ల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. ఆమెని టాప్ డాక్టర్లకు చూపించారు. కానీ.. లాభం లేకుండా పోయింది. హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి.. ఇలా అన్ని రకాల ట్రీట్‌మెంట్లు ట్రై చేశారు. అయినా నయం కాలేదు. రోజు రోజుకీ పరిస్థితి మరింత దిగజారింది.
చివరికి ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలైంది. డాక్టర్లు మరో 6 నెలల పాటు ఇలాగే ఉంటే ప్రాణాపాయం తప్పదన్నారు. దాంతో చివరి ప్రయత్నంగా శ్రేయ చాట్ జీపీటీని ట్రై చేసింది. దానికి తన తల్లి వాడిన మందులు, ట్రీట్‌మెంట్లతోపాటు పరిస్థితిని వివరంగా చెప్పింది. అప్పుడు చాట్ జీపీటీ శ్రేయకు ఆ సమస్యకు గల కొన్ని కారణాలు చెప్పింది. వాటిలో బీపీ మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ కూడా ఒకటి. అప్పటివరకు ఏ డాక్టరూ ఆ మందుల వల్ల ఇలాంటి సమస్య వస్తుందని వాళ్లకు చెప్పలేదు.
దాంతో శ్రేయ డాక్టర్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో అతను వేరే మందులు ఇచ్చాడు. అప్పటినుంచి ఆమె తల్లి కోలుకోవడం మొదలైంది. అందుకే శ్రేయ సంతోషం వ్యక్తం చేస్తూ.. చాట్ జీపీటీ తన తల్లి ప్రాణాలను కాపాడిందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్‌ను కూడా ట్యాగ్ చేసింది.