కోహ్లీకి అతడే సరైన వారసుడు

కోహ్లీకి అతడే సరైన వారసుడు

ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్‌గా తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. విపరీతమైన పనిభారం కారణంగా వచ్చే టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి పొట్టి ఫార్మాట్‌లో ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయంపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. విరాట్ నిర్ణయాన్ని స్వాగతించిన గవాస్కర్.. టీ20ల్లో అతడి స్థానంలో కెప్టెన్ ఎవరనే విషయంలో తొందరగా క్లారిటీకి రావాలని హితవు పలికాడు. 

‘కోహ్లి తర్వాత ఎవరు కెప్టెన్ అనే విషయంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తుండటం మంచి పరిణామం. భవిష్యత్ గురించి ఆలోచించడం మంచి విషయం. ఒకవేళ ఏదైనా ప్లేయర్‌కు కొత్త కెప్టెన్‌గా చాన్స్ ఇవ్వాలనుకుంటే కేఎల్ రాహుల్‌నే ఎంపిక చేయాలి. అతడు టీ20ల్లో చాలా బాగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌తోపాటు వన్డే క్రికెట్‌లోనూ అతడు తన సత్తా చాటాడు. అతడ్ని ఇప్పుడు వైస్ కెప్టెన్‌ చేయాలి. ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ స్కిల్స్‌ను రాహుల్ చూపించాడు. కెప్టెన్సీ భారాన్ని తన బ్యాటింగ్‌పై పడకుండా అతడు జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి కేఎల్ రాహుల్‌ను సారథ్య రేసులోకి తీసుకోవాలి’ అని గవాస్కర్ సూచించాడు.