ప్రతి 15 ఏండ్లకు ఈవీఎంలకే రూ.10 వేల కోట్ల ఖర్చు

ప్రతి 15 ఏండ్లకు ఈవీఎంలకే రూ.10 వేల కోట్ల ఖర్చు
  • జమిలి ఎన్నికలపై కేంద్రానికి ఎన్నికల సంఘం సమాచారం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రతి 15 ఏండ్లకు ఒకసారి ఈవీఎంలను కొనేందుకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈవీఎంల కాలపరిమితి 15 ఏండ్లు మాత్రమేనని, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మూడుసార్లు మాత్రమే వాటిని ఉపయోగించే వీలుంటుందని చెప్పింది. ఇక త్వరలో జరగబోయే లోక్‌‌సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.8 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు వివరాలు అందజేసింది. జమిలి ఎన్నికలకు వెళ్తే అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 సెట్ల ఈవీఎంలు కావాలని తెలిపింది. ఈవీఎంలలో ఏదైనా సమస్య తలెత్తితే మార్చేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ మెషీన్లు కూడా అదనంగా ఉండాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 46,75,100 బ్యాలెట్‌‌ యూనిట్లు, 33,63,300 కంట్రోల్‌‌ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్‌‌ మెషిన్లు కావాలని వివరించింది. 2023 నాటికి ఈవీఎంల ధర.. ఒక్కో బ్యాలెట్ యూనిట్‌‌కు రూ.7,800, కంట్రోల్ యూనిట్‌‌కు రూ.9,800, వీవీ ప్యాట్‌‌కు రూ.16 వేలుగా ఉంది.