ట్రాక్టర్ ర్యాలీలో అరెస్ట్‌ అయిన రైతులకు అండగా ఉంటాం: పంజాబ్ సీఎం

ట్రాక్టర్ ర్యాలీలో అరెస్ట్‌ అయిన రైతులకు అండగా ఉంటాం: పంజాబ్ సీఎం

ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న వారికి రెండు లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానాకు చెందిన రైతులు గత సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో క్యాంపులు ఏర్పాటుచేసి మరీ నిరసన తెలుపుతున్నారు. 

అయితే జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు కొన్ని మార్గాల్లో అనుమతించారు. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎర్రకోట వద్ద పోలీసులకు రైతులకు తోపులాట జరిగింది. దాంతో పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అయినా కూడా ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశించి జెండాలను ఆవిష్కరించారు. దాంతో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అలా ఢిల్లీ పోలీసులతో అరెస్టు కాబడిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు.

‘కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. జనవరి 26, 2021న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మందికి రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాము’ అని సీఎం చన్నీ ట్వీట్ చేశారు.