- కృష్ణ శిల, తమిళ శిల్పులతో రాతికట్టడాలకు సన్నద్ధం
- మాస్టర్ ప్లాన్ కు శృంగేరి పీఠాధిపతి అనుమతులు
- ఈనెల 17న ఆలయ పునరుద్ధరణ పనులకు అంకురార్పరణ
- ఆదిముక్తీశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాట్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: విశిష్ట శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందిన కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం త్వరలో కొత్తరూపును సంతరించుకోనుంది. కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 1976లో అప్పటి ప్రభుత్వం పునరుద్ధరించగా, 1982లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు ఆలయ పునఃప్రతిష్ఠ చేశారు. మూడు దశాబ్దాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 21న రూ.198 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ఆలయ అభివృద్ధి పనులు అడుగులు పడుతున్నాయి. ఇటీవల కాళేశ్వర క్షేత్ర మాస్టర్‌ప్లాన్‌కు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి ఆమోదం తెలపడంతో ఈ నెల 17న శృంగేరి పీఠ శిష్యబృందం సమక్షంలో పునరుద్ధరణ పనులకు అంకురార్పణ చేయనున్నారు.
దక్షిణ త్రివేణి సంగమం..
కాళేశ్వరం దక్షిణ త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలో అరణ్య ప్రాంతాల మధ్య వెలసిన ఈ క్షేత్రం, గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల సంగమ స్థలంగా విశిష్టతను సంతరించుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సిమెంట్ కట్టడాలను తొలగించి, గర్భగుడి నుంచి ప్రాకార మండపం వరకు మార్పులు చేపట్టేందుకు దేవాదాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. శృంగేరి పీఠాధిపతి ఆమోదం ఇవ్వడంతో పాటు శిష్యబృందం శాస్త్రోక్త పూజలతో పనులను ప్రారంభించనుంది.
ఇటీవల దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఈవో మహేశ్, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ తదితరులు కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంను సందర్శించి మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించారు. డిజైన్‌ను పరిశీలించిన విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి పునరుద్ధరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఆదిముక్తీశ్వర ఆలయంలో దర్శనాలు..
ఆలయ పునరుద్ధరణ సందర్భంగా కాళేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారి దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరుద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు దర్శనాలు అక్కడే కొనసాగుతాయి. శని, కాలసర్పదోశ నివారణ పూజలు గోదావరి తీరంలోని సరస్వతీఘాట్ వద్ద చేసేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది లోపే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి ఆలయ పునఃప్రతిష్ఠ చేసేలా ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. ఆలయ పునరుద్ధరణతో మూడు దశాబ్దాల నాటి ఆలయం పూర్తిగా కొత్తకళ సంతరించుకుని, రమణీయంగా మారనున్నది.
కృష్ణశిలతో ఆలయ నిర్మాణం..
దేవతా విగ్రహాలు చెక్కెందుకు ఉపయోగించే పవిత్రమైన కృష్ణశిలతో ఆలయ నిర్మాణ పనులను తమిళనాడుకు చెందిన శిల్పులతో చేపట్టనున్నారు. ఇప్పటికే ఆలయ పునరుద్ధరణ క్రమంలో కాళేశ్వర, ముక్తీశ్వర రూపాలైన రెండు శివలింగాల కొలతలను తీసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.198 కోట్లతో గర్భాలయం, శుభానందదేవి, సరస్వతీ దేవి ఆలయాలు, ఉప ఆలయాలు, సుబ్రమణ్యస్వామి, విజయగణపతి ఆలయం, రాజగోపురాలు, ప్రవేశ తోరణం, గుండం చెరువు సుందరీకరణ, షాపింగ్ క్లాంపెక్స్ లు, భక్తులకు విశ్రాంతి గదుల నిర్మాణాలు చేయనున్నారు.
