మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ నిధులు .. మెరుగపడనున్న పట్టణాల్లోని సానిటేషన్

మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ నిధులు .. మెరుగపడనున్న పట్టణాల్లోని సానిటేషన్
  • నాలుగు లక్ష్యాల సాధనకు ఫండ్స్ కేటాయింపు
  • బయోమైనింగ్​ ప్రక్రియకు ప్రయారిటీ
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2.53 కోట్లు రిలీజ్

కోల్​బెల్ట్, వెలుగు: పట్టణాల్లోని శానిటేషన్​మరింత మెరుగుపడేలా కేంద్రం స్వచ్ఛభారత్​ నిధులు కేటాయించింది. చెత్త రహిత పట్టణాలు, నగరాలుగా తీర్చిదిద్దడమే టార్గెట్​గా చేపట్టిన స్వచ్ఛ భారత్​మిషన్​(అర్బన్) 2.0లో భాగంగా లక్షలోపు జనాభా ఉన్న పట్టణ, స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్​లో ప్రారంభమైన ఈ స్కీమ్ 2026 అక్టోబర్​ వరకు కొనసాగనుంది. ముఖ్యంగా నాలుగు లక్ష్యాలు సాధించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ.2.53 కోట్ల ఫండ్స్​ను తాజాగా రిలీజ్​చేశారు. ఏటా రెండు విడతల్లో ఈ  నిధులు 
రానున్నాయి. 

చేపట్టే పనులు ఇవే..

కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రాం(సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు), వినియోగ నీటి వ్యర్థాలు, ఘన వ్యర్థాలు నిర్వహణ, బయోమైనింగ్, సమాచారం, విజ్ఞానం, కమ్యూనికేషన్​(ఐఈసీ) కార్యక్రమాల నిర్వహణకు ఈ ఫండ్స్​ను వినియోగించాలి. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) పట్టణాలుగా ప్రకటించిన పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సానిటేషన్, ప్రత్యేక ప్రజా మరుగుదొడ్లు(యాస్పిరేషనల్​ టాయిలెట్స్), జీవ వైవిధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. 

ప్రధానంగా బయోమైనింగ్​కు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మున్సిపాలిటీల్లోని డంపింగ్​యార్డులను శుభ్రంగా ఉంచనున్నారు. పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుట్టలుగా పేరుకుపోయే చెత్తకుప్పలను చదును చేయడంతో పాటు కంపోస్ట్​గా వినియోగించుకునేందుకు వీలుగా బయోమైనింగ్ ​నిర్వహణ చేపట్టనున్నారు. బయోవేస్టేజ్​ ద్వారా వచ్చే వ్యర్థాల నాణ్యతను బట్టి సిమెంట్​ఫ్యాక్టరీలకు ఎగుమతి చేయనున్నారు. నిర్మాణాలు, కొనుగోళ్లు, వేతనాల చెల్లింపులకు ఈ నిధులు వినియోగించవద్దని ఆదేశాలున్నాయి.​

బయోమైనింగ్​ కార్యకలాపాలు మరింత స్పీడప్

స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్​) 2.0 ఫండ్స్ ద్వారా మున్సిపాలిటీల్లో మరింతగా మెరుగైన సానిటేషన్​ చేపట్టవచ్చు. బయోమైనింగ్​ ద్వారా పేరుకుపోయిన చెత్తను చదును చేసి సాధారణ నేలగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశ్యం. నిధులు మంజూరు కావడంతో బయోమైనింగ్​ పనుల్లో స్పీడ్​ పెరుగుతుంది. ఈ స్కీమ్​ మరో ఏడాదిపాటు కొనసాగనుంది.

గద్దెరాజు, మున్సిపల్​ కమిషనర్, క్యాతనపల్లి