రూ.525 కోట్లతో 60 హ్యామ్ రోడ్ల నిర్మాణం

రూ.525 కోట్లతో 60 హ్యామ్ రోడ్ల నిర్మాణం
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాలో  ఫస్ట్ పేజ్ లో ఐదు నియోజకవర్గాల్లో  రూ.302.45 కోట్లతో 18 రోడ్ల నిర్మాణం 
  • సెకండ్ పేజ్ లో రూ.223.12 కోట్లతో 38.40 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి 
  • ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రోడ్ల నిర్వహణ
  • జిల్లా కేంద్రాలకు లింక్‌  కానున్న గ్రామీణ రోడ్లు 

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్ బీ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 537.57 కిలోమీటర్ల పొడవుతో 60 రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.525 .97  కోట్లతో అంచనాలు రూపొందించగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

హ్యామ్ ఫస్ట్ ఫేజ్ లో ఈ పనులన్నింటినీ ఆర్అండ్ బీ శాఖ చేపట్టబోతోంది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి పనులు అప్పగించనుంది.  కొత్తగా రోడ్లు నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడంతో పాటు పూర్తిస్థాయిలో రిపేర్లు చేయనున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్లను విస్తరించడంతో గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్ అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో 

హ్యామ్ పద్ధతిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రోడ్ల అభివృద్దికి మొదటి మూడు ప్యాకేజీలలో అవకాశం కల్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్అండ్ బీ శాఖ మంత్రి కావడంతో జిల్లా రోడ్లకు మొదటిలోనే అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీలుగా రోడ్ల అభివృద్ధి చేయనుండగా మూడు ప్యాకేజీలలో ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించారు. 

ఐదు సెగ్మెంట్లలో  ఫేజ్1 కింద పనులు 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు ప్యాకేజీల్లో పనులు చేపడుతుండగా నల్గొండ,  సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు.  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 537.57 కిలోమీటర్ల పొడవుతో 60 రోడ్లు నిర్మించనున్నారు. మొదటి సర్కిల్‌లో  రూ.302.45 కోట్లతో 18 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

 నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 223.12 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టనుండగా ఇందులో 38.4  కిలో మీటర్ల పొడవున డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు. నల్గొండ  సర్కిల్- 2 పరిధిలో 26  రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.  నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌‌నగర్, సూర్యా పేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. 

సర్కిల్-1 కింద అభివృద్ధి చేయనున్న రహదారులు ప్రాంతాలు ఇవే.. 

మహబూబ్‌నగర్- నల్గొండ రోడ్డు 15.2 కిలోమీటర్లు,  నల్గొండ , చౌటుప్పల్ 15  కిలో మీటర్లు, మరో ప్యాకేజీలో 42.8 కిలోమీటర్లు,  నల్లగొండ- -కట్టంగూర్ రోడ్డు 7.7 కిలోమీటర్లు, మరో ప్యాకేజీలో 4 కిలోమీటర్లు. మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి  యాచారం వరకు రెండు భాగాలు 13.62 కిలోమీటర్లు,  మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి నార్కట్ పల్లి  నల్గొండ - నాగార్జున సాగర్ రోడ్డు వరకు రెండు భాగాలు 22.6 కిలోమీటర్లు,  నకిరేకల్- మూసీ రోడ్డు 12 కిలోమీటర్లు, కట్టంగూర్- -ఈదులూరు రోడ్డు-11, నకిరేకల్-– -గురజాల రోడ్డు 17.6 ,కురుమర్తి –- శాలిగౌరారం -10.2 కిలోమీటర్లు, ఈదులూరు –- -తక్కెళ్లపాడు- 5  కిలోమీటర్లు,  తక్కెళ్లపాడు -– -మనిమద్దె రోడ్డు 8 కిలోమీటర్లు 

డబుల్ రోడ్డుగా విస్తరించేవి ఇవే..

మునుగోడు -కొండాపూర్ రోడ్డు 9.2 కిలోమీటర్లు
ఇడికుడ  -నారాయణపూర్ రోడ్డు 19.2 కిలోమీటర్లు 
కచలాపూర్ -కిష్టాపురం రోడ్డు 10 కిలోమీటర్లు