నిందితుడు రాకపోయినా అప్పీలుపై విచారణ జరపాల్సిందే : హైకోర్టు

నిందితుడు రాకపోయినా అప్పీలుపై విచారణ జరపాల్సిందే : హైకోర్టు
  • క్రిమినల్ అప్పీళ్ల కొట్టివేతపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  క్రిమినల్ కేసుల్లో శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను, నిందితుడు లేదా ఆయన తరఫు న్యాయవాది విచారణకు హాజరుకాలేదనే కారణంతో కొట్టివేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అప్పీలును విచారణకు స్వీకరించిన తర్వాత కేసుకు సంబంధించిన రికార్డులు, వాదనల్లోని అంశాలను పరిశీలించి మెరిట్స్ ఆధారంగా నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.

నిందితుడి తరఫున న్యాయవాది అందుబాటులో లేకపోతే అమికస్ క్యూరీని నియమించి విచారణ కొనసాగించాలని తెలిపింది. సికింద్రాబాద్‌కు చెందిన ఎలక్ట్రో హోమియోపతి వైద్యుడు ఖుర్షీద్ అన్వర్ భక్షిపై నమోదైన క్రిమినల్ కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అప్పీలు దాఖలు చేయగా, నిందితుడు మరియు ఆయన న్యాయవాది హాజరుకావడం లేదన్న కారణంతో అదనపు సెషన్స్ జడ్జి దానిని కొట్టివేశారు.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలుదారు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ సందర్భంగా అప్పీలుదారు తరఫు న్యాయవాదికి పలుమార్లు అవకాశం ఇచ్చినా హాజరుకాకపోవడంతో, స్వయంగా కేసు రికార్డులను పరిశీలించారు. అప్పీలుదారు గైర్హాజరు కారణంగా క్రిమినల్ అప్పీలును తిరస్కరించడానికి వీల్లేదని ధనంజయ్ రాయ్ వర్సెస్ బిహార్, కె.ఎస్. పాండురంగ వర్సెస్ కర్నాటక, ముంగానందన్ వర్సెస్ తమిళనాడు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఈ సూత్రానికి విరుద్ధంగా అదనపు సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, కేసులోని రికార్డులు, అంశాలను పరిశీలించి అప్పీలుపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.