రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ కు నూకలు చెల్లినయ్..షా పాదయాత్రతో కాంగ్రెస్ పీఠాలు కదులుతున్నాయ్ : ఎంపీ రఘునందన్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ కు నూకలు చెల్లినయ్..షా పాదయాత్రతో కాంగ్రెస్ పీఠాలు కదులుతున్నాయ్ : ఎంపీ రఘునందన్ రావు
  • ముందు మీ పార్టీలో నేతల పంచాయితీ చక్కబెట్టుకో
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌‌‌పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాదయాత్రతో కాంగ్రెస్ పీఠాలు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు. కనీసం హైదరాబాద్ ప్రజలకు నీళ్లిచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ సర్కార్‌‌‌‌కు లేదని విమర్శించారు. దేశంలో పట్టుమని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, 22 రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఉందని చెప్పారు. తాము అనుకుంటే ఏమైనా చేయగలమని, కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని అన్నారు.

మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా పాదయాత్రపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా హైదరాబాద్‌‌‌‌కు వస్తే తెలంగాణకు ఏం చేశారని పీసీసీ అడుగుతోందని రఘునందన్ రావు అన్నారు. మరి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ ఢిల్లీకి వచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. ఢిల్లీ వచ్చిన ఓ మంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేపై బూతుపురాణం చదివారని ఆరోపించారు.

స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని చెబుతున్నారని అన్నారు. అమిత్ షా యాత్రపై వ్యాఖ్యలు చేసే ముందు సొంత పార్టీలో పంచాయితీ చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ‘అధికారంలోకి వచ్చాక మూడేండ్లకు పీసీసీకి విభజన హామీలు గుర్తొచ్చాయా? గత పదేండ్లలో ఏం చేశారు? విభజన హామీలపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయండి. ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేశారు? పెన్షన్లు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు?’ అని ప్రశ్నించారు. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐదు రాష్ట్రాల్లో ఓడుతామనే ‘సర్’ హడావుడి

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది లేదని తెలిసే కాంగ్రెస్ ‘సర్’ పేరుతో హడావుడి చేస్తోందని రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో హైదరాబాద్‌‌‌‌లో మంచినీటి సమస్య తలెత్తిందని ఆరోపించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకవైపు తిక్క ప్రభుత్వం, మరోవైపు తిక్కలోడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌‌‌‌కు వాటర్ ట్యాంకర్లు రాకుండా రింగ్ రోడ్డు దగ్గర అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు నీళ్లు ఇవ్వకపోగా, వచ్చే ట్యాంకర్లను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నీటి కొరతతో మాదాపూర్‌‌‌‌లో 20 వేల మంది విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు.