- గతేడాది కంటే అదనంగా రూ.7,515 కోట్లు వసూలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబర్లో రాష్ట్రానికి ఏకంగా 22 శాతం వృద్ధి రేటుతో రూ.7,738 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే నెలలో నమోదైన రూ.6,332 కోట్లతో పోలిస్తే ఇది రూ.1,406 కోట్లు అధికం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలాన్ని పరిశీలిస్తే, మొత్తం వాణిజ్య పన్నుల రాబడి రూ.52,113 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.44,598 కోట్లతో పోలిస్తే ఏకంగా రూ.7,515 కోట్ల నికర పెరుగుదలతో 17 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
వ్యాట్ వసూళ్లలో 31 శాతం వృద్ధి
పండుగల సీజన్ కావడంతో పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం విక్రయాలపై వచ్చే వ్యాట్ వసూళ్లు ఏకంగా 31 శాతం వృద్ధితో దూసుకెళ్లాయి. గతేడాది అక్టోబ ర్లో వ్యాట్ తో రూ.2,342 కోట్లు రాగా, ఈసారి అ దనంగా రూ.723 కోట్లు సమకూరి రూ.3,065 కోట్లకు పెరిగింది. జీఎస్టీ రాబడి సైతం17 శాతం పెరుగుదలను కనబరిచింది.
గత అక్టోబర్లో జీఎస్టీ కింద రూ.3,914 కోట్ల ఆదాయం లభించగా, ఈసారి అది రూ.679 కోట్లు పెరిగి రూ.4,593 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి వసూలయ్యే ప్రొఫెషన్ ట్యాక్స్ రాబడిలో 5 శాతం స్వల్ప పెరుగుదల నమోదైంది. గతేడాది రూ.76 కోట్లుగా ఉన్న ఈ పన్ను వసూళ్లు, ఈసారి రూ.4 కోట్లు పెరిగి రూ.80 కోట్లకు చేరాయి.
ప్రధాన పన్ను విభాగాలన్నీ రెండంకెల వృద్ధి
ఇక ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న ఏడు నెలల మొత్తం పనితీరును విశ్లేషిస్తే, ప్రధాన పన్ను విభాగాలన్నీ రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో రూ.24,974 కోట్లుగా ఉన్న జీఎస్టీ రాబడి, ఈసారి ఏకంగా 19 శాతం వృద్ధితో రూ.29,630 కోట్లకు చేరుకుంది. అంటే జీఎస్టీ ద్వారానే ప్రభుత్వానికి అదనంగా రూ.4,656 కోట్ల రాబడి దక్కింది.
వ్యాట్ రూపంలో గతేడాది ఏడు నెలల్లో రూ.19,049 కోట్లు రాగా, ఈసారి 15 శాతం వృద్ధితో రూ.2,844 కోట్లు అదనంగా సమకూరి మొత్తం రూ.21,893 కోట్లకు చేరింది. ప్రొఫెషనల్ టాక్స్ కింద గతేడాది రూ.575 కోట్లు ఖజానాకు చేరగా, ఈసారి 3 శాతం వృద్ధితో రూ.15 కోట్లు అధికంగా వచ్చి రూ.590 కోట్లకు చేరింది.
