నెక్కొండ మండలంలో మునగ తోటల పేరుతో 30 లక్షలు స్వాహా

నెక్కొండ మండలంలో మునగ తోటల పేరుతో 30 లక్షలు స్వాహా
  •     ఖాళీ భూముల్లో తోటలు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు
  •     రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. విత్​డ్రా
  •     ఉపాధి హామీ సిబ్బంది పాత్రపై అనుమానాలు

నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మునగతోటల పేరుతో రూ.30 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయి. గ్రామానికి చెందిన 40 మంది రైతులు 2025–26 సంవత్సరానికి 40 ఎకరాల్లో ఎన్‌‌ఆర్‌‌జీఎస్‌‌ స్కీమ్ కింద మునగతోటలు సాగు చేస్తామని దరఖాస్తు చేసుకోగా అధికారులు అనుమతులు మంజూరు చేశారు. రైతులు తోటలు ఏర్పాటు చేశామని చెప్పడంతో ఆఫీసర్లు ఫీల్డ్​ సర్వే చేయకుండానే రికార్డుల్లో మునగ మొక్కలు ఉన్నట్లు నమోదు చేసి ఎంబీ రికార్డులు పూర్తి చేశారు.

అనంతరం రూ.30 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ డబ్బులను రైతులు డ్రా చేసినట్లు పలువురు గ్రామస్తులు ఈ నెల 25న ఎంపీడీవో కంప్లయింట్​ ఇచ్చారు. బుధవారం డీఆర్‌‌డీఏ పీడీ నాగపద్మజ, ఎంపీడీవో లావణ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేవలం 4 ఎకరాల్లో మాత్రమే మునగతోటలు ఉండగా, మిగతా 36 ఎకరాల్లో ఎలాంటి తోటలు లేవని గుర్తించారు. సాంక్షన్ జాబితాలో మాత్రం 40 మంది రైతుల పేర్లు ఉన్నట్లు తేలింది. తోటలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉపాధి హామీ సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్లే ఈ అవినీతి జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మునగతోటల పేరుతో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఆర్‌‌డీఏ పీడీ నాగపద్మజ తెలిపారు.