- కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మూలుగుతున్న రూ. 7కోట్లు
- సింగరేణి స్థలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- అబ్జెక్షన్చేసిన సింగరేణి... ఆగిన పనులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిధులున్నా పనులు చేసుకోలేని దుస్థితి. మున్సిపల్కార్పొరేషన్ ఆఫీసర్లు నగరంలోని సింగరేణి స్థలాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఆఫీసర్లు ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. తమ స్థలాల్లో ఎలా పనులు చేపడుతారంటూ సింగరేణి సంస్థ అడ్డుకుంది. దీంతో దాదాపు రూ. 7కోట్లు డీఎంఎఫ్టీ ఫండ్స్ ఏండ్లుగా మూలుగుతున్నాయి.
ప్లాన్ లేకపోవడమే..
కొత్తగూడెం నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం డీఎంఎఫ్టీ కింద రూ. 7 కోట్లు కేటాయించింది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి గత కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల నుంచి ప్రతిపాదనలు అడిగారు. ప్రజా ప్రతినిధులు తమ వార్డుల పరిధిలో ఎంపవర్ మెంట్ బిల్డింగ్స్, మహిళా సంఘాలకు సంబంధించిన ఆఫీస్లతో పాటు పలు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టారు. కౌన్సిల్ తీర్మానం అయిందంటూ ఆఫీసర్లు ఆయా పనులకు సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్లు పిలిచారు.
గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు కొత్తగూడెం నగరంలోని పోస్టాఫీస్ సెంటర్, రామవరం ప్రాంతాల్లో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ప్రతిపాదించిన పనులన్నీ సింగరేణి సంథలాల్లో ఉన్నాయి.
పనులు చేపట్టే టైంలో యాజమాన్యం అడ్డుకుంది. తమ స్థలాల్లో తమకు కనీస సమాచారం లేకుండా ఎలా పనులు చేపడుతారంటూ అబ్జెక్షన్ చెప్పింది. దీంతో పనులు ఆగిపోయాయి. పని చేపట్టే స్థలం ఎవరిది, ప్రైవేట్, గవర్నమెంట్, సింగరేణి, వివాదాల భూమినా అని సమాచారం లేకుండా కౌన్సిల్ ఆమోదించి టెండర్లు పలిచింది. పనులు మొదలు పెట్టే టైంలో సింగరేణి ఆఫీసర్లు ఆబ్జెక్షన్ చేయడంతో ఆఫీసర్లతో పాటు ప్రజా ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పలు పనులు దాదాపు రెండేండ్లుగా ముందుకు కదలడం లేదు. నిధులు ఉండి పనులు చేసేకోలేని దుస్థితి నెలకొంది.
