- అయినా.. సాదడానికి స్థోమతలేక 10 రోజుల పసిబిడ్డ అమ్మకం
- నల్గొండ జిల్లాలో ఘటన
- రూ. 3 లక్షలకు కొన్న గుంటూరు జిల్లా వాసులు
- విషయం ఆలస్యంగా వెలుగులోకి..!
- బిడ్డ తండ్రితోపాటు కొన్నవాళ్లు, దళారులపై కేసు
హాలియా, వెలుగు: అమ్మా.. చెల్లెను అమ్మొద్దే..” అంటూ తల్లిదండ్రులను ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నా.. ఆ అమ్మానాన్న మాత్రం పదిరోజుల పసిబిడ్డను అమ్మేశారు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉండటం, ఇంకో ఆడబిడ్డ పుట్టడంతో సాదడానికి స్థోమతలేక రూ. 3లక్షలకు విక్రయించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి (సాగర్) మండలంలోని ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి అనే గిరిజన దంపతులు ఏడేండ్ల కింద తండా నుంచి నల్గొండ పట్టణానికి వలస వెళ్లారు. ఈ దంపతులకు 2006 లో అబ్బాయి పుట్టాడు.
ఆ తర్వాత కొన్నిరోజులకే ఆ బాబు చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారు. 10 రోజుల కింద నాల్గో కాన్పులో కూడా అమ్మాయి పుట్టింది. పేదరికం కారణంగా సాదలేక దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లా వాసులకు పదిరోజుల బిడ్డను అమ్మేశారు. ఇందుకోసం గుంటూరు జిల్లా వాసులు రూ. 3లక్షలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. పెద్దవూర మండలం ఊరబావి తండాకు సమీపంలో పొట్టిచెలమ వద్ద చిన్నారిని అప్పగించారు. బిడ్డను అమ్మేస్తున్నప్పుడు కొర్ర బాబు, పార్వతి దంపతుల ఇద్దరు పెద్ద బిడ్డలు ఏడుస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
అమ్మా.. చెల్లెను అమ్మొద్దే..”అంటూ ఆ చిన్నారులు ప్రాధేయపడుతున్నట్లు అందులో ఉంది. శిశువిక్రయం ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కాగా, పదిరోజుల పాప కనిపించడం లేదంటూ కొర్ర బాబు అన్న సురేశ్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు
శిశు విక్రయం ఘటనకు సంబంధించి నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు.. శిశువును అమ్మిన తండ్రితో పాటు కొనుగోలుచేసిన వ్యక్తులపై, మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని చెప్పారు. ఎంక్వైరీ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
