టార్గెట్ సెంట్ పర్సెంట్.. మహబూబ్ నగర్ ఫస్ట్ తో శతశాతం ప్రోగ్రాం

టార్గెట్ సెంట్ పర్సెంట్..   మహబూబ్ నగర్ ఫస్ట్ తో  శతశాతం  ప్రోగ్రాం
  • వందేమాతరం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మోటివేషన్​ క్లాసెస్​
  • ప్రతి స్కూల్​లో లిటిల్​ లీడర్లు, లిటిల్​ టీచర్స్​
  • మొదటి విడతగా 28 బడుల్లో ప్రాజెక్టు ప్రారంభం

మహబూబ్​నగర్​, వెలుగు : సర్కారు బడుల్లో టెన్త్​ క్లాస్​చదువుతున్న స్టూడెంట్లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మహబూబ్​నగర్ ఫస్ట్ సహకారంతో ఇటీవల 'శత శాతం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన స్టూడెంట్లకు వర్క్​ షాప్​ పూర్తి చేశారు. దీంతో వీరు సోమవారం నుంచి స్కూల్స్​లో లిటిల్​లీడర్స్, లిటిల్​టీచర్లుగా వ్యవహరించనున్నారు. 

మొదటి విడతలో 28 బడులు.. 263 స్టూడెంట్ల ఎంపిక

'శత శాతం' కార్యక్రమంలో భాగంగా మహబూబ్​నగర్​ నియోజకవర్గంలోని హన్వాడ, మహబూబ్​నగర్​, మహబూబ్​నగర్​రూరల్​మండలాల్లోని 28 ప్రభుత్వ బడులను ఎంపిక చేశారు. ఈ బడుల్లో టెన్త్​ క్లాస్​చదువుతున్న 263 మంది స్టూడెంట్లను ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసులో శని, ఆదివారాల్లో శిక్షణ క్లాసులు నిర్వహించారు.

 ఈ తరగతుల్లో స్టూడెంట్లు టీచర్లు చెబుతున్న పాఠశాలను వినడమే కాకుండా.. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకున్న సబ్జెక్టును తోటి స్టూడెంట్లకు ఎలా వివరించాలి?  గ్రూప్​ డిస్కషన్స్ ఎలా చేయాలి? తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ల పట్ల ఎలా వ్యవహరించాలి? పెద్దలను ఎలా గౌరవించాలి? తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 

మానిటరింగ్​ చేసేందుకు వాలంటీర్లు

28 బడుల్లోని 263 స్టూడెంట్ల వ్యవహార శైలి ఎలా ఉందనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. స్టూడెంట్లను మానిటరింగ్ చేసేందుకు గాను పీజీలు కంప్లీట్​ చేసిన వారిని వాలంటీర్లుగా ఎంపిక చేశారు.  ప్రతి స్కూల్​కు ఒకరు చొప్పున మొత్తం 28 మందిని ఆయా బడుల్లో నియమించారు.  వీరు ఎంపికైన స్టూడెంట్లకు మెంటర్లుగా వ్యవహరించనున్నారు. 

ప్రాజెక్టుకు ఎంపికైన స్టూడెంట్లు సక్రమంగా చదువుకుంటున్నారా? క్లాస్​రూమ్​లో వారి ప్రవర్తన ఎలా ఉంది? స్కూల్​కు క్రమం తప్పకుండా వస్తున్నారా? తరగతి గదుల్లో పార్టిసిపేట్​ చేస్తున్నారా? తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉంటున్నారా? వారికిచ్చిన టాస్క్​ను కరెక్ట్​గా చేస్తున్నారా? అనే విషయాలను ఆయా స్కూళ్ల హెచ్​ఎంల సూపర్ వైజింగ్​లో వాలంటీర్లు పర్యవేక్షణ చేయనున్నారు. 

లిటిల్​లీడర్లు..  లిటిల్​టీచర్లు

263 మంది స్టూడెంట్లకు శిక్షణ తరగతులు పూర్తి కావడంతో.. సోమవారం నుంచి వీరు లిటిల్​ లీడర్లు, లిటిల్​ టీచర్లుగా వ్యవహరించనున్నారు. చురుగ్గా ఉన్న పిల్లలను లిటిల్​ లీడర్స్​గా, అకడమిక్​ సబ్జెక్టులపై గ్రాస్పింగ్​ పవర్​ ఉన్న స్టూడెంట్లను లిటిల్ టీచర్లుగా వాలంటీర్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన లిటిల్​ లీడర్లు, లిటిల్​టీచర్లు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్లను, ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన స్టూడెంట్లను గుర్తించనున్నారు. 

వీరికి గ్రూప్​ డిస్కషన్స్ ద్వారా సబ్జెక్టులపై అవగాహన కల్పించనున్నారు. డ్రాప్​ ఔట్​అయిన స్టూడెంట్లు ఎందుకు బడులు మానేశారనే విషయాలపై సదరు స్టూడెంట్​ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఆ వివరాలను హెచ్​ఎంలకు వివరించి.. తిరిగి ఆ స్టూడెంట్​ను స్కూల్​కు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయనున్నారు. క్లాస్​రూమ్​లో బిహేవియర్​ సరిగ్గా లేని స్టూడెంట్లను గుర్తించి వారికి మోటివేషన్​ క్లాసులు ఇవ్వనున్నారు. తద్వారా ప్రతి ప్రభుత్వ బడిలో టెన్త్​ చదువుతున్న స్టూడెంట్లు  నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రయత్నం చేస్తున్నారు. 

వసల కూలీల పిల్లలను రత్నాలుగా మార్చుతాం

పాలమూరు అంటేనే వలసల జిల్లా.  అలాంటి వారి పిల్లలకు ఉన్నతమైన విద్యను అందిస్తాం. వారిని రత్నాలుగా మార్చి ప్రపంచానికి చూపిస్తాం. ఇక్కడి ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పిల్లలకు టాలెంట్​ ఉంది. కరెక్ట్​గా మోటివేట్​ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతి గవర్నమెంట్​ స్కూల్​లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతోనే 'శత శాతం' కార్యక్రమాన్ని ప్రారంభించాం.

 రానున్న ఐదారేండ్లలో పాలమూరులోని ప్రభుత్వ బడుల్లో అద్భుతాలు సృష్టించే స్టూడెంట్లు ఉంటారు. ఈ ప్రాజెక్టు గొప్ప ప్రయోగం. ఈ ప్రయోగాన్ని సఫలీకృతం చేసుకోవాలి. రాష్ర్టంలోని ప్రతి బడికి దీనిని విస్తరించాలని నా కోరిక.– యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్​