హలో.. డాక్టర్! టెలీమెడిసిన్కు పల్లెల్లో ఆదరణ

హలో.. డాక్టర్! టెలీమెడిసిన్కు పల్లెల్లో ఆదరణ
  • మూడేండ్లలో 17 లక్షల మందికి సూపర్ స్పెషాలిటీ వైద్యుల కన్సల్టేషన్
  • మొదటి మూడు స్థానాల్లో నిజామాబాద్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలు 

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో టెలీమెడిసిన్ కు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. స్పెషలిస్ట్  కన్సల్టేషన్  నుంచి నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, ఎండోక్రైనాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  వరకు సొంత గ్రామంలోని ప్రైమరీ హెల్త్  సెంటర్ల నుంచే వీడియో కాల్  ద్వారా పొందుతున్నారు. 2022 నుంచి 2025 జూన్  వరకు 2.52 కోట్ల స్పెషలిస్ట్   కన్సల్టేషన్స్, 17.68 లక్షల సూపర్ స్పెషాలిటీ  కన్సల్టేషన్స్  టెలీమెడిసిన్ లో నమోదయ్యాయి. 

పీహెచ్ సీల నుంచి వెబ్ బేస్డ్, ఆండ్రాయిడ్  యాప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఈ-ప్రిస్క్రిప్షన్, ఎలక్ట్రానిక్  హెల్త్  రికార్డ్  లాంటి అధునాతన సౌకర్యాలు టెలీమెడిసిన్  ద్వారా గ్రామీణులు పొందుతున్నారు. టెలీమెడిసిన్  కన్సల్టేషన్  సేవలు 2018 లోనే రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. మొదట స్పెషలిస్ట్  కన్సల్టేషన్  మాత్రమే అందుబాటులో ఉండగా.. 2022లో సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలను అందుబాటులోకి తెచ్చారు. హబ్  అండ్  స్పోక్  మోడల్‌‌‌‌‌‌‌‌ తో ఆపరేట్ అయ్యే ఈ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో... పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు స్పోక్‌‌‌‌‌‌‌‌ లుగా.. జిల్లా, ఏరియా హాస్పిటల్స్  హబ్‌‌‌‌‌‌‌‌ లుగా పని చేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 77 స్పెషాలిటీ హబ్‌‌‌‌‌‌‌‌ లలో 1,000 మంది స్పెషలిస్ట్  డాక్టర్లు టెలీమెడిసిన్  ద్వారా కన్సల్టేషన్  సర్వీస్  అందిస్తున్నారు.

20  స్పెషాలిటీ కన్సల్టేషన్లు

ఆఫ్తల్మాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, యూరాలజీ వంటి 20 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలు టెలీమెడిసిన్ ద్వారా అందిస్తున్నారు. జనరల్  మెడిసిన్, ఒబ్స్టెట్రిక్స్  అండ్  గైనకాలజీ (ఓబీజీ), పీడియాట్రిక్  మెడిసిన్  కన్సల్టేషన్లు కూడా ఎక్కువగా వినియోగించు కున్నారు. జనరల్  మెడిసిన్‌‌‌‌‌‌‌‌లో 4.11 లక్షలు, ఓబీజీలో 3.01 లక్షలు, పీడియాట్రిక్  మెడిసిన్‌‌‌‌‌‌‌‌లో 1.91 లక్షల, ఆర్థోపెడిక్స్ లో 1.61 లక్షలు, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీలో 1.12 లక్షలు, డెర్మటాలజీలో 1.05 లక్షలు, డైటెటిక్స్ లో 1.04 లక్షలు, జనరల్ సర్జరీలో 95 వేలు.. ఇలా స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వినియోగించుకున్నారు.

 నెఫ్రాలజీలో 25,260,  సైకియాట్రీలో 23,831, ఎండోక్రైనాలజీలో 22,660, గ్యాస్ట్రో ఎంటరాలజీ 6 వేలు, కార్డియాలజీలో 1,225, ఆంకాలజీలో 1,207 లాంటి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స సర్వీసెస్  వీడియో కాల్  ద్వారా పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల నుంచే అందుతున్నాయి. వారంలో ఒక్కో రోజు డెర్మటాలజీ, డైటీషియన్, ఫిజియాట్రీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ లాంటి స్పెషాలిటీల కన్సల్టేషన్లు అందుబాటులో ఉంటాయి. కేవలం మూడేండ్ల కాలంలోనే ఏకంగా 17 లక్షల మంది టెలీమెడిసిన్  ద్వారా కన్సల్టేషన్  సేవలు పొందారు.

1.29 లక్షలతో నిజామాబాద్ టాప్

టెలీమెడిసిన్  ద్వారా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలు పొందడంలో నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్  జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 1.29 లక్షల స్పషలిస్ట్  కన్సల్టేషన్స్, యాదాద్రి భువనగిరిలో 1.20 లక్షలు, నాగర్ కర్నూల్ లో 1.16 లక్షల స్పెషలిస్ట్  కన్సల్టేషన్స్  నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే భద్రాద్రి కొత్తగూడెంలో 95,286, ములుగు 31,556, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ 13,199 జిల్లాల నుంచి కూడా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలు వాడుకున్నారు. సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవల కోసం జిల్లా హాస్పిటల్స్, లేదా హైదరాబాద్  వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్  సేవలు అందుబాటులో ఉండడంతో డబ్బుతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.