కేసీఆర్ ​పైసలింకా ఇయ్యలే : సీఎం భూపేశ్ బఘేల్​

కేసీఆర్ ​పైసలింకా ఇయ్యలే : సీఎం భూపేశ్ బఘేల్​

ఆదిలాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ నోటీసులతో సరిపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని చత్తీస్​గఢ్​సీఎం భూపేశ్​బఘేల్ ఆరోపించారు. సోమవారం ఆదిలాబాద్​లో రోడ్ షో నిర్వహించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణకు 24 గంటలు కరెంటిస్తున్నామంటున్నారు..ఆ కరెంటు మేమే సప్లై చేస్తున్నం. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా కేసీఆర్ సర్కార్ బకాయిపడి ఉంది’ అని అన్నారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కచ్చితంగా అమలు చేస్తామన్నారు. 

తెలంగాణ ఆర్థిక పరిస్థితి తమ ఆరు  గ్యారంటీలపై ప్రభావం చూపబోదన్నారు. చత్తీస్ గఢ్​లో కోటి ఎకరాల భూమిని ఆదివాసీలకు పంపిణీ చేశామని, రూ.9.50 వేల కోట్లను ఆదివాసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మోదీ, కేసీఆర్ లది ఒకే విధానమని, వారు అంతర్గత మిత్రులన్నారు. కర్ణాటక తరహా ఫలితాలే తెలంగాణలో వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ బాండ్ పేపర్ రాసిచ్చారు. కర్నాటక ఎమ్మెల్సీ, ఆదిలాబాద్ పార్లమెంటు పరిశీలకులు ప్రకాష్ రాథోడ్, మహారాష్ట్ర మాజీ మంత్రి అనీస్ అహ్మద్, ఏఐసీసీ సభ్యులు అబ్బాస్, టీపీసీసీ కార్యదర్శి వెంకటేశం ఉన్నారు. 

టాటా బిర్లాను దాటిన కేసీఆర్​ ఆస్తులు

నిజామాబాద్ : స్లిప్పర్లు వేసుకొని తిరిగిన బీఆర్ఎస్​అధినేత కేసీఆర్,​ ఆయన కుటుంబీకులు ఇప్పుడు రూ.10 లక్షల కోట్ల ఆస్తులతో టాటాబిర్లాను దాటేశారని చత్తీస్​గఢ్​సీఎం భూపేశ్​బఘేల్​ఆరోపించారు. నిజామాబాద్​అర్బన్​సెగ్మెంట్​లోని దుబ్బా ఏరియాలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్​ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడారు. అడ్డగోలు అవినీతి, సంపాదన సొమ్ముతో దేశంలోని ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల లీడర్లను కొనుగోలు చేసి చక్రం తిప్పే కుట్ర చేశారని, నిజాలు గ్రహించి వారు దూరం పాటించారని చెప్పారు. ఇసుక, గ్రానైట్, మొరం దందాలో మునిగితేలుతున్నారని, కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​నిర్మాణ డొల్లతనం మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో బయటపడిందన్నారు. రూ.1,600 కోట్ల ప్రజల డబ్బుతో నిర్మించిన సెక్రటేరియట్​లోకి ప్రజలను రానీయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, కేసీఆర్​రాచరిక పాలన నడుపుతున్నారని మండిపడ్డారు.  

అడుగడుగునా బెల్టు షాపులే : విజయశాంతి

జాబ్స్​లేక యువత నిర్వేదం చెందుతుండగా వారిని నిస్సత్తువుగా మార్చడానికి తెలంగాణలో అడుగడుగడునా మద్యం బెల్ట్​షాపులు నడుపుతున్నారని కాంగ్రెస్​ నాయకురాలు సినీనటి విజయశాంతి మండిపడ్డారు. ప్రజలకవసరమైన పనులు చేయడం కేసీఆర్​కు ఇష్టముండదన్నారు. బీఆర్ఎస్​ను రాజకీయంగా బొందపెట్టే టైమ్​వచ్చేసిందని, దొర పాలన నుంచి విముక్తి పొందబోతున్నామన్నారు. 

గజ్వేల్​లో భూములు మిగల్లే..

కబ్జా చేయడానికి గజ్వేల్​లో భూములు లేకపోవడంతో కేసీఆర్​నజర్​ఉమ్మడి జిల్లా వైపు మరలి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని నిజామాబాద్​ అర్బన్​కాంగ్రెస్​అభ్యర్థి షబ్బీర్​అలీ ఆరోపించారు. లిక్కర్ స్కామ్​లో కవిత అడ్డంగా దొరకడంతో ఆమెను బీజేపీ వద్ద సరెండర్​చేశారని, బీజేపీ, బీఆర్ఎస్​ఒక్కటేనన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్​సంజయ్, తాహెర్, భక్తవత్సలం నాయుడు, గడుగు గంగాధర్, రత్నాకర్, కేశవేణు ఉన్నారు.