- ఉమ్మడి మెదక్ జిల్లాలో 63 గ్రామాలు ఎంపిక
- ఎంపికైన గ్రామాలలో మొదలైన గ్రామసభలు
- సర్వే పూర్తయ్యాక రైతులకు భూదార్ కార్డులు
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: అనేక ఏళ్ల కింద రూపొందించిన రికార్డులు శిథిలావస్థకు చేరడం, మ్యాప్‌లు, టీపన్‌లు అందుబాటులో లేకపోవడంతో చాలా గ్రామాల్లో భూ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు కాస్తులో ఉన్నా వారికి పట్టాలు లేవు. పట్టాలు ఉన్న కొందరు కాస్తులో లేరు. దీనివల్ల భూ వివాదాలు తలెత్తుతుండటంతోపాటు, ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల ఫలాలు అర్హులకు అందడం లేదు. ఈక్రమంలో కాస్తు ప్రకారం టైటిల్ఉండాలనే ఉద్దేశంతో సీసీఎల్‌ఏ భూ భారతి చట్టం ప్రకారం భూములకు సంబంధించిన మ్యాప్‌లు, టీపన్‌లు లేని గ్రామాల్లో రీసర్వే చేయాలని నిర్ణయించింది. శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 393 గ్రామాలను ఎంపిక చేయగా.. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 63 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు.
గ్రామ సభల్లో సర్వేపై అవగాహన
ఉమ్మడి మెదక్ జిల్లాలో భూములకు సంబంధించిన మ్యాప్‌లు, టీపన్‌లు లేని 63 గ్రామాలను భూముల రీసర్వేకు ఎంపిక చేయగా.. మెదక్ జిల్లాలో 24, సిద్దిపేట జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 17 గ్రామాలను ఎంపిక చేశారు. మండలానికి ఒకటి రెండు అంతకన్నా గ్రామాలను ఎంపిక చేసి రెవెన్యూ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ షురూ చేశారు. ఇప్పటికే రీసర్వేకు సంబంధించి గ్రామసభలు కూడా మొదలయ్యాయి. ఈ గ్రామ సభల్లో సర్వే ఉద్దేశం కలిగే ప్రయోజనాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
రోవర్‌లతో సర్వే
భూముల రీ సర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రోవర్‌లు వచ్చాయి. మెదక్ జిల్లాకు 11 రోవర్‌లను తీసుకురాగా.. వీటి సాయంతో జీపీవోలు, సర్వేయర్ల సమక్షంలో గ్రామాల సరిహద్దులు నిర్ణయిస్తారు. అనంతరం మొదట ప్రభుత్వ భూముల సర్వే చేపడతారు. చెరువులు, కుంటల శిఖం భూములు, కాల్వలు, ఆర్ అండ్ బీ, ఫారెస్ట్ భూముల విస్తీర్ణం, హద్దులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత రైతుల పట్టా భూముల సర్వే నిర్వహిస్తారు. ఎంజాయ్‌మెంట్ ప్రకారం రైతుల పట్టా భూములను సర్వే చేసి కాస్తులో ఉండి పట్టాలు లేని వారు ఎవరు, పట్టాలు ఉండి కాస్తులో లేని వారు ఎవరనేది నిర్ధారిస్తారు. సర్వే పూర్తయ్యాక మళ్లీ గ్రామ సభ నిర్వహించి సర్వేలో నిర్ధారించిన విషయాలను రైతులకు తెలియజేస్తారు. డిజిటల్సర్వేలో ప్రతి భూమికి కోడ్ కేటాయిస్తారు. సర్వే మొత్తం పూర్తయ్యాక భూ యజమానులకు ఆధార్ కార్డు తరహాలో ప్రత్యేక భూదార్ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా విదేశాల్లో ఉన్నవారు సైతం అక్కడి నుంచే తమ భూమి స్థితి గతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
భూముల రీసర్వే ప్రక్రియ మొదలైంది
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ మొదలైంది. మెదక్ జిల్లాలో 24 గ్రామాలు ఎంపిక కాగా, 5 చోట్ల గ్రామసభలు పూర్తయ్యాయి. శాటిలైట్ఆధారంగా డిజిటల్ సర్వే చేసేందుకు జిల్లాకు 11 రోవర్‌లు వచ్చాయి. ల్యాండ్ సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో భూరికార్డులు డిజిటలైజేషన్ చేస్తాం. రీ సర్వే పూర్తయితే మ్యూటేషన్ సమస్య ఉండదు. భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగినపుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రికార్డ్ అప్డేట్అవుతుంది. జిల్లాలో కోర్ స్టేషన్ ఏర్పాటు కోసం కలెక్టర్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ పంపించాం. -కిషన్, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్, మెదక్
