
- పరారీలో మరో ముగ్గురు
దేవరకొండ, వెలుగు : డీసీఎంలో అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం స్టేజ్ వద్ద దేవరకొండ ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటువైపు వస్తున్న డీసీఎంను ఆపి తనిఖీ చేయగా.. 6 క్వింటాళ్ల కిలోల నల్లబెల్లం,100 కేజీల పటిక లభించింది.
డ్రైవర్ చంద్రపాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కర్ణాటకలోని బీదర్ కు చెందిన నారాయణ వద్ద కొనుగోలు చేసి కొండమల్లేపల్లి మండలం అంగోత్ తండాకి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. కొండమల్లేపల్లి మండలానికి చెందిన ఆంగోతు రమేశ్, ఆంగోత్ తరుణ్ కొంతకాలంగా స్థానికంగా నల్ల బెల్లం వ్యాపారం చేస్తున్నట్టు తెలిపాడు. చంద్రపాల్ ది ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కాళహస్తి. కాగా అతడిని అరెస్ట్ చేశారు. 6 క్వింటాళ్ల నల్ల బెల్లం,100 కేజీల పటిక, డీసీఎం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.