హైదరాబాద్ లో అందరూ చూడాల్సిన 7 గణేష్ మండపాలు ఇవే.

హైదరాబాద్ లో అందరూ చూడాల్సిన 7 గణేష్ మండపాలు ఇవే.

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఉత్సవాలకు, పర్వదినాలకు కొదవ లేదు. భాగ్యనగరంలో బోనాల సందడి పూర్తయిన వెంటనే వినాయకచవితి ఉత్సవాలు ఊపందుకున్నాయి. మరికొద్దిరోజుల్లోనే మహా సంబరం మొదలు కానుంది. వినాయక మండపాలతో సందడి షురూ కానుంది.  తెలుగురాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్.  నవరాత్రిళ్ల సమయంలో నిత్యం వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.  గణపతి బప్పా మోరియా, జైబోలో గణేశ్ మహారాజ్ కీ జై అనే నినాదాలతో వాడవాడలు, గల్లీ గల్లీ హోరెత్తిపోనున్నాయి. అయితే నగరంలో ఖైరతాబాద్ వినాయకుడి మండపంతో పాటు బాగా ప్రాచర్యం పొందిన అత్యంత ప్రసిద్ది చెందిన ఏడు గణేష్ మండపాలున్నాయి. గణపతి నవరాత్రిళ్ల సమయంలో భాగ్యనగరంలో దర్శించాల్సిన వినాయకచవితి మండలపాలగురించి తెలుసుకుందాం. . . .  .

1.   ఖైరతాబాద్

ఖైరతాబాద్ గణేష్ కమిటీ 1954 నుండి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది (2023) ఖైరతాబాద్‌ గణేశుడు 63 అడుగుల ఎత్తుతో.. శ్రీ దశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు ఖైరతాబాద్‌లో కొలువు దీరి ప్రజలను అలరించనున్నాడు.  శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు.   ఈ ఏడాది స్వామి దర్శనానికి రాలేని భక్తుల కోసం  ఆన్‌లైన్ దర్శనం, ఆన్‌లైన్ పూజ, ఆన్‌లైన్ ప్రసాదం డోర్ డెలివరీ  వంటి సదుపాయాలు కూడా  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి ఏర్పాటు చేసింది. 

2..బాలాపూర్ 

బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాట మాత్రం 1994లో రూ.450తో ప్రారంభమైంది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. నమ్మకమే కాదు.. దీనిని వేళంలో దక్కించుకున్న వారు అనుభవపూర్వకంగా చెప్పినమాటలు. లడ్డూ వేలంపాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు అవకాశమిస్తున్నారు. వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు, బాలాపూర్ లడ్డూ ధరపై చర్చించుకుంటారు. వేలం రోజు వేకువజాము నుంచే కోలాహలం నెలకొంటుంది. వినాయక చవితి మొదటి రోజు నుంచే పోటీ పడుతున్న వారి దరఖాస్తులు తీసుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటలకు దరఖాస్తులను ముగిస్తారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పైన సంతకం చేయాలి. 

Also Read :- బొజ్జ గణపయ్యకు అవంటే చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా

బాలాపూర్ లడ్డూ ద్వారా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారు.  2022లో  బాలాపూర్ లడ్డూ   24 లక్షల 60 వేలు ధర పలికింది.

3. గౌలిపురలో గణేష్ వేడుకలు

పాతబస్తీ ప్రాంతంలో, హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలకు అత్యంత పురాతనమైన  ప్రసిద్ధ మండపాల్లో  గౌలిపుర గణపతి ఒకటి. ఇక్కడ సంప్రదాయ వేడుకలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహిస్తారు.  అయితే గౌలిపురలో ఏర్పాటు చేసే వినాయకుని మండపం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా తమిళనాడు, కర్నాటక మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల ప్రజలను కూడా ఆకర్షిస్తోంది.  కొన్నేళ్ల క్రితం  పండల్ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి రూపంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది హైదరాబాద్ నగర ప్రజలకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది.  ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఇక్కడ గణేషుడిని ప్రతిష్టిస్తారు.  భారీ అలంకరణ, సెట్టి్ంగ్ లతో ఏర్పాటు చేస్తారు.  


4. బేగంబజార్ గణేష్ 

వినాయకచవితి పండుగకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో నగరంలోని బేగంబజార్‌ కిటకిటలాడింది. పండుగకు కావాల్సిన ప్రతిమలతో పాటు పూజ సామగ్రి కొనుగోలు చేయడానికి రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారుతాయి. విభిన్న వినాయకుని విగ్రహాలు మార్కెట్‌లో సందడి చేస్తాయి. కొనుగోలుదారుతో మార్కెట్‌ కళకళలాడుతోంది. నగరంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గణపతి నవరాత్రిళ్లు జరుగుతాయి.  బేగంబజార్   కోల్‌కతా, షోలాపూర్ గణేష్ విగ్రహాలకు  నెలవుగా మారింది.  నిమజ్జనానికి ఊరేగింపు బేగంబజార్ భక్తులు గుంపులు గుంపులుగా ఏర్పడి నృత్యాలు చేస్తారు.  మహారాజ్​గంజ్​, న్యూ ఉస్మాన్​గంజ్​, బేగంబజార్, గన్​ఫౌండ్రి తదితర చోట్ల విభిన్న రూపాల్లో ఏకదంతుడి ప్రతిమలు ఏర్పాటు చేస్తారు.

5. కమలానగర్, చైతన్యపురిలో ...

దక్షిణ భారతదేశంలో గణేష్ ఉత్సవాలకు పేరుగాంచిన పట్టణం హైదరాబాద్‌ మహానగరంలో  కమలానగర్, చైతన్యపురి,  నాగోల్‌లలో గణేశ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. చైతన్యపురి,  కమలానగర్  లో ఏర్పాటు చేసే మండపాలకు విద్యుత్​ దీపాల అలంకరణలు భక్తుల హృదయాలను కట్టిపడేస్తాయి. ఆయా మండపాల వద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రంజింపజేస్తాయి.  భారీ సెట్టింగులతో ప్రతిమలు ఏర్పాటు చేస్తారు. నవరాత్రిళ్ల సమయంలో అన్నదానం, భారీ బ్యాండ్ ప్రదర్శనలు, వీధుల్లో చేసే నృత్యాలు భక్తులను కట్టి పడేస్తాయి. 

6. ఉస్మాన్‌గంజ్ లో ఇలా... 

వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏ వీధి చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. కేవలం పూజలే కాకుండా ప్రతిమలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ తమ అభిరుచిని చాటుతారు మండపాల నిర్వాహకులు. హైదరాబాద్​ పరిధిలో వివిధ ఆకృతులతో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని విగ్రహాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతకు మెరుగులద్ది సరికొత్తగా ప్రతిమలు రూపొందించారు. మహారాజ్​గంజ్​, న్యూ ఉస్మాన్​గంజ్​ తదితర చోట్ల విభిన్న రూపాల్లో ఏకదంతుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు. రావణుడి తలపై ఉన్న పార్వతీ సుతుడు, విద్యుత్​కాంతుల మధ్య తాండవం చేస్తున్న వక్రతుండుడు, సంజీవిని పర్వతం ఎత్తుకున్న గజాననుడు, సింహ వాహనంపై మూషిక వాహనుడు, శివుని ఆకారంలో ఉమాసుతుడు, కృష్ణుని ఒడిలో కూర్చున్న కరివదనుడు ఇలా వివిధ రకాల్లో కొలువైన అధినాయకుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఉస్మాన్ గంజిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పడు భారీ ర్యాలీ చేస్తారు.  గణపతి బప్పా మోరియా అంటూ స్వామిని కొలుస్తారు.  

7. ధూల్‌పేట్ గణపతి ఉత్సవాలు... 

ధూల్ పేటలో వినాయక ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.  వారు తయారు చేసిన ప్రతిమలకే పూజలు చేస్తారు.  చిన్న చిన్న విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠి్ంచి.. భజనలు చేస్తూ చివరి రోజున  జైగణేశ నినాదాలతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.  హైదరాబాద్ ధూల్ పేట బొజ్జ గణేశుడి విగ్రహాలకి కేరాఫ్ అడ్రస్. గణపతి విగ్రహాల తయారీలో దేశంలోనే ధూల్‌పేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ జీవం పోసుకునే విగ్రహాలు తెలుగురాష్ట్రాలకే కాదు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఎవరు ఏ డిజైన్ కావాలంటే ఆ ఆకృతిలో దేవుడి రూపాలను మలచి ఇవ్వడం ధూల్ పేట కళాకారుల ప్రత్యేకత. ఇక్కడ తయారయ్యే ఈ విగ్రహాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి నెలల ముందుగానే ఇక్కడికి చాలామంది వస్తారు. ఫలానా స్టయిల్ లో విగ్రహాల తయారీ ఉండాలని ఆర్డర్ ఇస్తారు. ఇలా సమ్మర్ సీజన్ మొత్తం విగ్రహాల తయారీలోనే మునిగిపోతారు ఇక్కడి కళాకారులు.  వీళ్లంతా తమ తాతల కాలం నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ విగ్రహాల డిజైన్‌లు మారుస్తారు.