
- వాళ్లు వాళ్లు కొట్టుకొని మమ్మల్ని బద్నాం చేస్తున్నరు
- వాళ్ల వెనక, వీళ్ల వెనక ఉండాల్సిన అవసరం నాకు లేదు
- నేను లీడర్‌ను.. జనం ముందుంటా
- కేసీఆర్ చచ్చిన పాము.. ఆయనను చంపాల్సిన అవసరం ఏముంది?
- ఖమ్మం జిల్లా చండ్రుగొండ బహిరంగ సభలో సీఎం ప్రసంగం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
- తన ఇల్లు కట్టుకున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఆనందపడ్డానని వ్యాఖ్య
కొత్తగూడెం, వెలుగు: కల్వకుంట్ల కుటుంబంలో లక్ష కోట్ల అవినీతి సొమ్ము చిచ్చు పెట్టిందని, దోపిడీ సొమ్ము కోసం బావ, బామ్మర్ది, అన్న, చెల్లె (హరీశ్‌రావు, సంతోష్‌రావు, కేటీఆర్, కవిత) కొట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఒక లీడర్‌నని, అభివృద్ధి కోసం ముందుంటాను తప్ప.. వారి వెనక.. వీరి వెనక ఉండాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 03) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చండ్రుగొండలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఒక చచ్చిన పాము.. 2023 డిసెంబర్ నెలలోనే ఆ కాలనాగును ప్రజలే కట్టేసి కొట్టి చంపేసిన్రు..ఆ చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకు లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘మీ పంపకాల్లో పంచాయితీ వస్తే కుటుంబ పెద్ద దగ్గరకు వెళ్లండి.. తెగకపోతే కులపెద్ద దగ్గరికి పోండి.. అక్కడ కూడా తెగకపోతే మంత్రగాడి దగ్గరకు వెళ్లండి.. అంతే తప్ప మీ కుటుంబ పంచాదీలో మమ్మల్ని లాగకండి’’ అని కవితకు, బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
‘‘ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో పెట్టిన సమావేశం కాదిది. పేద ఆడబిడ్డలు సొంతిళ్ల కోసం పదేండ్లుగా కం డ్లు కాయలు కాసేలా చూసిన్రు. మా జీవితాలు ఇంతే. వెలుగు లేదు. సొంతింటి కల నెరవేరే అవకాశం లేదు అని బతికిన్రు. అయినా పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు వాళ్లని పట్టించుకోలేదు” అని సీఎం అన్నారు.
నా ఇల్లు కట్టినప్పటికంటే ఎక్కువ ఆనందం
జూబ్లీహిల్స్‌లో తన ఇల్లు కట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే.. ఇప్పుడు ఆశ్వరావుపేటలో పేదలు గృహ ప్రవేశం చేస్తుంటే తనకు అంతకంటే మించిన ఆనందం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘నేను నాయకపోడు రమణమ్మ ఇంటికి పోయినప్పుడైనా, పేద మైనార్టీ బిడ్డ కండ్లలో ఆనందం చూసినప్పుడైనా కలిగిన ఆత్మ సంతృప్తి గొప్పది. ఏ నాయకునికైనా ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి’’ అని అన్నారు.
2023 ఎన్నికల సందర్భంగా ఆనాటి సీఎంకు తాను సవాల్ విసిరానని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఇండ్లల్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మీరు ఓట్లు అడగండని సవాల్ విసిరానని గుర్తుచేశారు. అలా అయితే ఆ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ దక్కేది కాదని పేర్కొన్నారు. హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉండచ్చుగాని.. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదని తెలిపారు. రాజీవ్ స్వగృహ పేరుతో పట్టణాల్లో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో వైఎస్సార్ సుదీర్ఘ పాదయాత్ర చేసి.. తండాలు, గూడేల్లో పేదల సమస్యలు తెలుసుకొన్నారని, వారి బలమైన ఆకాంక్షను గుర్తించారని రేవంత్ తెలిపారు.
ఆనాడు వైఎస్సార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి ప్రతి పేదవాడికి పదేండ్లలో 25 లక్షల ఇండ్లు అందించారని, ప్రతి యేటా 2.5 లక్షల ఇండ్లు ఇచ్చారని చెప్పారు. గత పదేండ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరో 25 లక్షల ఇండ్లు పేదలకు దక్కేవని అన్నారు. కానీ, అధికారం చేపట్టిన వాళ్లు (బీఆర్ఎస్) పేదోళ్ల కోసం కాకుండా తమ సంపాదన పెంచుకోవడానికే పనిచేశారని తెలిపారు. 110 నెలలు అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్ల చొప్పున లక్ష కోట్లకు పైగా అవినీతి సొమ్ము కూడబెడితే.. ఇప్పుడు ఆ సొమ్ము కోసం సొంత పిల్లల మధ్య తేడావచ్చి బళ్లాలు తీసుకొని పొడుసుకుంటున్నారని కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు తమ పార్టీకీ సహజ మిత్రులని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి పనిచేయాలన్నారు.
ఖమ్మంది ప్రత్యేక స్థానం!
రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమం మొదలైంది ఈ జిల్లాలోనే అని పేర్కొన్నారు. అందుకే ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులనిచ్చామని అన్నారు. కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ శాఖ లు ఇదే జిల్లాలో ఉన్నాయని, ఆ మంత్రుల నుంచే తాను నిధులు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తనకు బలమైన, సమర్థుడైన మంత్రి కావాలని ఆలోచన చేసి రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలకమైన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అప్పగించినట్టు చెప్పారు.
ఇందుకోసం సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేతో మాట్లాడి ఒప్పించానన్నారు. భూభారతి ద్వారా లక్షలాది భూ సమస్యలు పరిష్కరించారని చెప్పారు. రాజ్యసభకు అవకాశం వస్తే.. ఇదే జిల్లాకు చెందిన రేణుకకు ఇచ్చామని తెలిపారు. అందరు ఎమ్మెల్యేలకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే ఎమ్మెల్యే ఆది నారాయణకు 4,500 ఇండ్లు ఇచ్చామని పేర్కొన్నారు.
పదేండ్లలో ఒక్క కార్డు ఇయ్యలే!
గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్తగా పెళ్లైన కుటుంబ సభ్యుల్లో ఆడబిడ్డ పేర్లను అక్కడ తొలగించి, ఇక్కడ చేర్చడం వంటి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. గత సర్కారు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాకు పనికొచ్చేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఓ పేదింటికి వెళ్లి భోజనానికి కూర్చుంటే.. దొడ్డు బియ్యం వండిపెట్టడానికి ఆ ఇంటి ఆడబిడ్డ బాధపడిందని గుర్తు చేశారు. ‘‘మేం అధికారంలోకి వస్తే జూబ్లీహిల్స్‌లోని నా ఇంట్లో తినే బియ్యమే.. మీ ఇంట్లో వండుకునేలా చేస్తామని ఆనాడు హామీ ఇచ్చా. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో అది నెరవేరింది. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం చంటిబిడ్డలకు వండిపెడుతుంటే ఆడబిడ్డల కండ్లల్లో ఎంతో సంతోషం కనిపిస్తున్నది” అని తెలిపారు.
మన తలరాతల్ని మార్చేది విద్య ఒక్కటే
మన తలరాతల్ని మార్చేది విద్య ఒక్కటే అని విద్యార్థులకు సీఎం రేవంత్ తెలిపారు. విద్యాబుద్ధులు కలిగిన వారు జీవితంలో ఎంతో ఎదుగుతారన్నారు. గత ప్రభుత్వం ‘‘గొర్రెలు పెంచుకోండి.. చేపలు పట్టండి.. చెప్పులు కుట్టండి.. అని చెప్పి రాజ్యాలను మాత్రం వారి పిల్లలు పాలించేలా చేసి దోచుకో వడానికి బాటలు వేసింది’’ అని మండిపడ్డారు. పేదవాడు పరిపాలన చేయాలని, పేదోడు ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు.
తమ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మో టిక్ చార్జీలు 200 శాతం పెంచా మని చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీలు చదువుకున్న వారికి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా నైపుణ్యాభివృద్ధి పెంచి జపాన్, సింగపూర్, సౌత్ కొరియా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ‘‘చదువుకు ఏం కావాలో నన్ను అడగండి.. ఎవరో సాయం చేయాలని ఎదురుచూసే స్థాయి నుంచి ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి’’ అని పేర్కొన్నారు.